calender_icon.png 17 February, 2026 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మర్ చైర్‌పర్సన్‌గా గోనె లహరి

16-02-2026 06:40:28 PM

ఆర్మూర్‌ బల్దియాను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ

– 36 వార్డుల్లో 19 మంది కౌన్సిలర్ల బలంతో తిరుగులేని పార్టీగా నిలిచిన కాంగ్రెస్‌

– మద్దతుగా నిలిచిన ఎంఐఎం, ఇద్దరు స్వతంత్రులు

– 22 ఓట్లతో  చైర్‌ పర్సన్, వైస్‌ చైర్మన్‌ల పీఠాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

– వైస్‌ చైర్‌ పర్సన్‌గా 11వ వార్డు కౌన్సిలర్‌ కాటిపల్లి వెంకట్‌రెడ్డి ఎన్నిక

ఆర్మూర్‌,(విజయక్రాంతి): ఆర్మూర్‌ మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగరవేసింది. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వు కాగా సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో చైర్‌ పర్సన్‌గా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గోనె లహరి, వైస్‌ చైర్‌ పర్సన్‌గా కాటిపల్లి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు. 36 వార్డుల్లో 19 మంది కౌన్సిలర్ల బలం కాంగ్రెస్‌ పార్టీకే ఉండటంతో ఒక ఎంఐఎం కౌన్సిలర్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సైతం కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉండి ఓటింగ్‌ చేసారు. ఐదుగురు కౌన్సిలర్లు ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ చైర్‌ పర్సన్, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులను నిలబెట్టి ఓటమి పాలు కాగా, విప్‌ జారీ చేయడంలో సైతం విఫలమైన బీజేపీ 8 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితమైంది. దీంతో ఆర్మూర్‌ మున్సిపాలిటీకి నాలుగో పాలకవర్గం ఎన్నిక విజయవంగా ముగిసింది.

ఆర్మూర్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల అధికారి, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్నాన్‌ మాల్వియా, ఆర్మూర్‌ మున్సిపల్‌ కమీషనర్‌ ఉమా మహేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్, వైస్‌ చైర్మన్‌ల నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాల్సి ఉండగా అరగంట ఆలస్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతిని«ధి ఏబీ శ్రీనివాస్‌(చిన్న) ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు హైదరాబాద్‌ క్యాంపు నుంచి ఆర్మూర్‌ మున్సిపాలిటీకి ప్రత్యేక బస్సులో చేరుకున్నారు. అదే సమయానికి ఐదుగురు బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం కౌన్సిలర్, ముగ్గురు స్వతంత్రులు సమావేశపు గదికి చేరుకున్నారు.

గంట ఆలస్యంగా బీజేపీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు వచ్చారు. ఎన్నికలు నిర్వహించడానికి అనువైన కోరం సంఖ్య ఉండటంతో ప్రెసిడింగ్‌ ఆఫీసర్‌ సమావేశాన్ని ప్రారంభించారు. ముందుగా మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో ఆల్ఫబెటికల్‌ ఆర్డర్‌లో సబ్‌  కలెక్టర్‌ అభిగ్నాన్‌ మాల్వియా ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం వారు కౌన్సిలర్లుగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం చైర్‌ పర్సన్, వైస్‌ చైర్‌ పర్సన్‌ ఎన్నిక నిర్వహించారు. సమావేశ సమయానికి గంట ముందుగానే కాంగ్రెస్‌ పార్టీ విప్‌లను జారీ చేయగా ఆ పార్టీ నాయకులు వెంకట్రామ్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సాయిబాబ గౌడ్‌ ఎన్నికల అధికారికి అందజేసారు.

అదే విధంగా పార్టీ అధిష్టానం చైర్‌ పర్సన్, వైస్‌ చైర్మన్‌ల పేర్లను సూచించే సీల్డ్‌ కవర్‌ను ఎన్నికల అధికారికి అందజేసారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌తో పాటు చైర్‌ పర్సన్, వైస్‌ చైర్మన్‌ల పేర్లను సూచిస్తూ ఎన్నికల అధికారికి అందజేసారు. బీజేపీ విప్‌ను జారీ చేసినప్పటికీ  మున్సిపల్‌ ఎన్నికల ఫార్మేట్‌లో విప్‌ లేని కారణంగా బీజేపీ విప్‌ను తిరస్కరిస్తున్నట్లు సబ్‌ కలెక్టర్‌ అభిగ్నాన్‌  మాల్వియా ప్రకటించారు. మున్సిపాలిటీలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో పరిస్థి మొత్తం ఆ పార్టీకి అనుకూలంగా మారింది. అయినప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ నెలకొంది.

చైర్‌ పర్సన్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక

ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నిక సమావేశం ప్రారంభం కాగానే సబ్‌ కలెక్టర్‌ అభిగ్నాన్‌ మాల్వియా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీల్డ్‌ కవర్‌లో పంపిన చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా 15వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ గోనె లహరిని ప్రకటించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని 35వ వార్డు కౌన్సిలర్‌ సడక్‌ ప్రతిపాదించగా 14వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ సైఫ్‌ సోను బలపరిచారు. నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించగా 19 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం కౌన్సిలర్, ఇద్దరు స్వతంత్రులు చేతులు ఎత్తి తమ ఓటును వినియోగించుకున్నారు.

దీంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి 22 ఓట్లు వచ్చాయి. మరో  వైపు బీఆర్‌ఎస్‌ పార్టీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా 8వ వార్డు కౌన్సిలర్‌ డిచ్‌పల్లి శారదను 30వ వార్డు కౌన్సిలర్‌ పృథ్వీ ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్‌ రహమతున్నీసా బలపిరిచారు. ఓటింగ్‌ నిర్వహించగా 5 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో  కాంగ్రెస్‌ పార్టీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి గోనె లహరిని ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా విజయం సాధించినట్లు సబ్‌ కలెక్టర్‌ ప్రకటించారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీల్డ్‌ కవర్‌లో పంపించిన అభ్యర్థి 11వ వార్డు కౌన్సిలర్‌ కాటిపల్లి వెంకట్‌రెడ్డిని ప్రకటించారు.

ఆయన పేరును 6వ వార్డు కౌన్సిలర్‌ షేర్ల మమత ప్రతిపాదించగా 4వ వార్డు కౌన్సిలర్‌ సర్కెల్లి సృజన్‌ బలపరిచాడు. ఈయనకు కూడా 22 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా 28వ వార్డు కౌన్సిలర్‌ నజియా తసీన్‌ను 10వ వార్డు కౌన్సిలర్‌ నయీం ప్రతిపాదించగా 8వ వార్డు కౌన్సిలర్‌ డిచ్‌పల్లి శారద బలపరిచారు. కేవలం 5 ఓట్లు మాత్రమే రావడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకట్‌రెడ్డిని వైస్‌ చైర్మన్‌గా ప్రకటించారు. ఎన్నిక పూర్తి కావడంతో చైర్‌ పర్సన్‌గా, వైస్‌ చైర్‌ పర్సన్‌లచే ప్రమాణ స్వీకారం చేపించిన అనంతరం నియామకపు పత్రాలను సబ్‌ కలెక్టర్‌ చేతుల మీదుగా విజేతలకు అందజేసారు.

వారి విజయానికి కారణమైన కౌన్సిలర్లకు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గోనె లహరి, వైస్‌ చైర్‌ పర్సన్‌గా కాటిపల్లి వెంకట్‌రెడ్డి ఎన్నిక పూర్తి కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్‌ కార్యాలయం వెలుపల బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచిపెట్టుకుంటూ, ఒకరి నొకరు ఆలింగనం చేసుకుంటూ జై కాంగ్రెస్‌ నినాదాలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐలు సత్యనారాయణగౌడ్, జాన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం చుట్టు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.