గౌరవెల్లి నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
పరిహారం చెల్లించకపోతే సెప్టెంబర్‌లో సీపీఐ ఉద్యమం
ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం: చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 6న ప్రారంభమైన “బద్లావ్ జరూరి హై.. మార్పు కావాలి” ప్రజా చైతన్య పోరు పాదయాత్ర గురువారం హుస్నాబాద్‌లో ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, యువత, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఐ నిరంతరం పోరాడుతుందని చాడ వెంకటరెడ్డి అన్నారు.
హుస్నాబాద్ ప్రాంతానికి కమ్యూనిస్టు ఉద్యమంతో చారిత్రక అనుబంధం ఉందని, ప్రజా హక్కుల కోసం జరిగే పోరాటాల్లో సీపీఐ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, నిరుద్యోగులు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకలను మరింత బలోపేతం చేస్తామని, దేశంలో మార్పు కోసం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.
గౌరవెల్లి భూనిర్వాసితులకు పరిహారం ఎప్పుడు?
గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన భూనిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సీపీఐ అనేక పోరాటాలు చేసిందని, నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడతామని స్పష్టం చేశారు.పరిహారం విషయంలో సెప్టెంబర్ చివరి నాటికి ప్రభుత్వం న్యాయం చేయకపోతే సీపీఐ ఆధ్వర్యంలో భూనిర్వాసితులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
“పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప” అనే నినాదంతో ప్రజలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగిసినప్పటికీ ప్రజా సమస్యలపై సీపీఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.పాదయాత్ర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ప్రజల నుంచి సేకరించిన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ఉద్యమిస్తామని నాయకులు పేర్కొన్నారు.
సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేణి శంకర్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహా, హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జాగీర్ సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, కనుకుంట్ల శంకర్, ఫోనుగంటి కేదారి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నేదునూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.మూడు జిల్లాలకు చెందిన పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రజా చైతన్య పోరు పాదయాత్ర ముగింపు సభను విజయవంతం చేశారు.






