50 లక్షల గంజాయి పట్టివేత
- నలుగురు అరెస్ట్
రూ.72,500 నగదు స్వాధీనం
సికింద్రాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): నగరంలో గంజాయి అక్రమ రవాణాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు భగ్నం చేశారు. సుమారు రూ.50 లక్షల విలువైన 42.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు, తుని, నర్సీపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో నాలుగు బ్యాగుల్లో తీసుకువచ్చిన నిందితులు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద కొనుగోలుదారుని కోసం వేచి ఉన్న సమయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ బృందం పట్టుకుంది.
నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా మొత్తం 42.9 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద రూ.72,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ అయి న వారిలో గణేష్ శివనాథ్ బోడుగే (42), పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33),విన్నీ శైలేష్ మేశారాం (32),ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54) ఉన్నారు.
వీరంతా మహారాష్ట్రకు చెందినవారని అధికారులు తెలిపా రు. ఏపీ నుంచి గంజాయిని సేకరించి ముం బై, పుణే వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నర్సీపట్నం, తుని ప్రాంతాల్లో కిలోకు రూ.4 వేలకే కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్ముతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు.
ఈ ఆపరేషన్లో సీఐలు చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్త్స్రలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. భారీగా గంజాయి పట్టివేతకు పాల్పడిన ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్‌రెడ్డిని అభినందించారు.




