31 August, 2026 | 11:34 AM

40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

31-08-2026 10:32 AM

టేకులపల్లి, (విజయక్రాంతి): అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని టేకులపల్లి పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. బియ్యంతో పాటు అశోక్‌ లేలాండ్‌ బడా దోస్త్‌ వాహనాన్ని సీజ్‌ చేసి, ఐదుగురిపై కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశాల మేరకు, డీఎస్పీ యు. వెంకన్నబాబు సూచనలతో సీఐ బి. సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. భారత్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పీడీఎస్‌ బియ్యం బయటపడింది.

వాహన యజమాని మోగిల్ల శివప్రసాద్‌ను విచారించగా.. పాల్వంచకు చెందిన పిట్టల సంపత్‌కుమార్‌, బోయిన నాగేంద్రబాబు, కొప్పురాయికి చెందిన గొగ్గల కల్యాణ్‌ కుమార్‌లు టేకులపల్లి పరిసర గ్రామాల నుంచి తక్కువ ధరకు పీడీఎస్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి కాకినాడకు తరలిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కాకినాడకు బియ్యం తరలిస్తే అధిక కిరాయి ఇస్తానని గొల్లప్రోడుకు చెందిన అనిశెట్టి శ్రీనివాస్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న 40 క్వింటాళ్ల బియ్యం వి లువ సుమారు రూ.1,01,250గా పోలీసులు అంచనా వేశారు. బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేసి, ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.