నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
కాసిపేట, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపుర్ గ్రామంలో సోమ వారం ఉదయం దేవాపూర్ SI గంగారం ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 45 బైక్‌లను, ఒక ఆటో, 2 ట్రాలీలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా SI గంగారం మాట్లాడుతూ సైబర్ మోసాలు, సోషల్ మీడియా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు.
ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలు, సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 లేదా 112 సేవలను వినియోగించాలని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని వివరించారు.
యువత ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం స్వీయరక్షణ, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. గ్రామాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో అలాగే ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను తగ్గించవచ్చని, భద్రతను పెంచవచ్చని వివరించారు. పోలీసులు ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం, నేరాలను నివారించడం లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






