రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ
గుండాల, (విజయక్రాంతి): అఖిలభారత రైతు కూలీ సంఘం మండల కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం పాయం ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు చంద్రా రెడ్డి, ఏఐటీఎఫ్ జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, గుండాల సర్పంచి కోరం సీతారాములు పాల్గొని మాట్లాడుతూ...సెప్టెంబర్ 8, 9 తేదీలలో మంచిర్యాలలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని, ఈ సభలకు మండలం నుండి 20 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఆదివాసీల చట్టబద్ధ, సాంప్రదాయ హక్కులను పాలకవర్గాలు కాల రాస్తున్నాయని మండిపడ్డారు.
ముఖ్యంగా 1/70 చట్టాన్ని సవరించి ఆదివాసీల, గిరిజనుల భూములను ఎస్సీ, బీసీ పేద రైతుల భూములను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టనున్నారని, ఈ చట్ట సవరణను ఐక్యంగా ఎదుర్కోవాలని ఎస్టీ, ఎస్సీ, బీసీ పేద రైతులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంలో పాలకవర్గాలకు మద్దతునిచ్చే సంఘాలు తమ వైఖరిని మార్చుకోవాలని, విప్లవ ప్రజా సంఘాలు చేసే పోరాటంలో భాగస్వాములు కావాలని వారు కోరారు.
మండలంలో కరువు పరిస్థితులను శాశ్వతంగా నివారించుటకు దేవళ్ళగూడెం పెళ్లి వాగు ప్రాజెక్టును నిర్మించాలని, సీతారామ ప్రాజెక్టు ఎత్తిపోతల నీళ్లను పాత ప్రణాళిక ప్రకారం దేవళ్ళగూడెం వరకు తెచ్చి చెరువులు, కుంటలు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాప్ సిస్టం ద్వారా యూరియాను రైతులకు అందించే ప్రభుత్వ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర మహా సభల గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బచ్చలి సారయ్య, ఆరెం నరేష్, ఈసం మంగయ్య, సూర్యనారాయణ, కల్తి మల్లయ్య, 15 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






