23 August, 2026 | 5:53 PM

జేపీఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి పండగ ఉత్సవం

23-08-2026 03:48 PM

నేరేడుచర్ల, ఆగస్టు23 (విజయ క్రాంతి): నేరేడుచర్ల పట్టణంలోని జాన్‌పహాడ్ రోడ్డులో గల గంగమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం గంగమ్మ తల్లి పండగ ఉత్సవాలను జేపిఎస్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సభ్యులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఆటో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో ఉండాలని, పట్టణ ప్రజలపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. పండగ సందర్భంగా ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. ఆటో యూనియన్ సభ్యులు సమన్వయంతో ఉత్సవ ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సర్పంచ్ ఉప్పతల రవి, ఉప సర్పంచ్ శంకర్ నాయక్, ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్, కోశాధికారి బొమ్మకంటి సైదులు, కార్యదర్శి ఆంజనేయులు మరియు జెపిఎస్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.