లింగంపేట్, పిట్లం పోలీసుల దాడుల్లో జూదరుల అరెస్ట్
నగదు, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాల స్వాధీనం!
జూదం ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవు!! జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వెల్లడి!! కామారెడ్డి మే 15 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరంగా దాడులు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన పోలీసుల మెరుపు దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, రూ.2,590 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలో తిమ్మానగర్ కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు పోలీసుల దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.5,350 నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ జూదం అనే వ్యసనానికి బానిసైతే వ్యక్తులు అప్పుల పాలై, కుటుంబాల్లో ఆర్థిక,మానసిక సమస్యలు తలెత్తి, కొన్నిసార్లు ఆత్మహత్యలకు కూడా దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. జూదం కుటుంబాల్లో అశాంతిని కలిగిస్తుందని, యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. జూదం ఆడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.






