ఉత్తమ సేవా పురస్కార్ అందుకున్న శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి
కొడిమ్యాల ఆగస్టు 23 (విజయక్రాంతి): మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ (టిఎస్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి, శ్రీనివాస్ రెడ్డి వూట్కూరిని ఉత్తమ సేవా పురస్కార్–2026తో ఘనంగా సత్కరించారు. కరీంనగర్ పట్టణంలోని కళాభారతిలో ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ – మెగాస్టార్ చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారు ఈ పురస్కారాన్ని అందజేశారు.సమాజ సేవ పట్ల అంకితభావంతో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ గౌరవాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి మాట్లాడుతూ... ఈ పురస్కారం నా ఒక్కరి కృషికి దక్కిన గౌరవంగా భావించడం లేదు. సేవా కార్యక్రమాల్లో నాతో కలిసి నడుస్తున్న ప్రతి శ్రీనివాసుడికి, ప్రతి సేవా సహచరుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు. సమాజ సేవను బాధ్యతగా భావించి, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మానవత్వమే మార్గంగా మరింత అంకితభావంతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ఆయన తెలిపారు. ఈ పురస్కారం తమ సేవా సంకల్పానికి మరింత ప్రోత్సాహాన్ని, బాధ్యతను పెంచిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ గౌరవాన్ని అందించిన ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమీ – మెగాస్టార్ చిరంజీవి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ నిర్వాహకులకు, సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.






