calender_icon.png 8 February, 2026 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్ఎస్ఎల్‌లో అగ్నిప్రమాదంపై దుష్ప్రచారం

08-02-2026 02:21:40 PM

హైదరాబాద్: నాంపల్లిలోని రెడ్ హిల్స్‌లో ఉన్న తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ స్పందించారు. నిన్న ఉదయం 10.8 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని, ఫైర్ సిబ్బంది మధ్యహ్నం 1.30 గంటలకు మంటలు ఆర్పేసినట్లు ఆమె వెల్లడించారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ తో పాటు లైబ్రరీ, హెచ్ఆర్డీ రూమ్ కు మంటలు వ్యాపించాయని శిఖా గోయల్ తెలిపారు.

ఎఫ్ఎస్ఎల్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుదన్నారు. అగ్నిప్రమాదంపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రమాద సమయంలో ఎవరు ఉన్నారనే అంశంపై పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ చెప్పారు. రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామన్నారు.

2015 నాటి ఏసీబీ కేసు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని, ఈ కేసుకు సంబంధించిన ఏ సామాగ్రి మా వద్ద లేదని, అలాగే పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులోని ఆధారాలతో పాటు 2014 వరకు సేకరించిన 136 ఆధారాల్లో 7 మినహా అన్నింటినీ ఎప్పుడో కోర్టుకు ఇచ్చామని ఆమె తెలిపారు. అగ్నిప్రమాదం నష్టంపై అంచనాకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు.