18 July, 2026 | 1:08 AM

సూర్యాపేట మున్సిపాలిటీలో పదివేల మందికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ

18-07-2026 12:58 AM

టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట రూరల్, జూలై 17:  సూర్యాపేట నియోజకవర్గంలో మహిళల స్వయం ఉపాధిని పెంపొందించేందుకు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో త్వరలోనే ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, సుమారు 10 వేల మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట మండలం బాలెంల గ్రామంలో మదర్ ఇండియా సేవా సంస్థ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు నిర్వహించిన కుట్టు శిక్షణ విజయవంతంగా పూర్తి కావడంతో, వారి సర్టిఫికెట్ల ఖర్చుల నిమిత్తం ఆయన తన సొంత నిధుల నుండి 90,000/- రూపాయల చెక్కును సంస్థ నిర్వాహకులు బొజ్జ సంధ్యారెడ్డికి అందజేశారు.

ఈ సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది మహిళలకు ఆయన సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ’స్ప్రుడ్ ఇండియా’ ద్వారా నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్లు,

బెంచీలు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ఈ ఉచిత శిక్షణ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్న ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వెలుగు వెంకన్న, కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, నామ అరుణ, బైరబోయిన శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, బాలెంల సర్పంచ్ మమత నగేష్ తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.