calender_icon.png 23 February, 2026 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచితాలపై కన్నెర్ర!

21-02-2026 12:00:00 AM

ఉచిత పథకాలపై భారత సుప్రీంకోర్టు గురువారం చేసిన వ్యాఖ్యలు అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు అలవిగాని హామీలు, ఉచితాలను ఇస్తామని చెప్పడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిపోయింది. గతంలోనూ ఇలాంటి ఉచితాలపై భిన్న వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు తాజాగా ఉచితాల వల్ల ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అన్నింటినీ ప్రభుత్వాలే ఉచితంగా అందిస్తూ ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే తమిళనాడు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ డీఎంకే చేసిన ఉచిత వాగ్ధానాలపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం కోసం వాగ్దానాలను చేయడం రాజకీయ పార్టీలు పోటీపడడం సహజమే. కానీ ఆ వాగ్దానాలను ప్రజలు నమ్మకపోవడంతో వారిని నమ్మించడానికి కొత్తకొత్త పథకాలను, తాయిలాలను ప్రకటిస్తున్నారు. అయితే ఆ పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది అర్థం కావడం లేదు.

గతంలోనూ తమిళనాడులో అక్కడి పార్టీలు, వ్యక్తులు ఇలాంటి ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ పలుమార్లు కోర్టులను ఆశ్రయించాయి. 2013 నాటి సుబ్రమణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసు దీనికి ఉదాహర ణ. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా కలర్ టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, మిక్సీలు, నాలుగు గ్రాముల బంగారం ఉచితంగా పంపిణీ చేస్తామని వాగ్దానం చేయడాన్ని సవాల్ చేస్తూ సుబ్రమణ్యం బాలాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎన్నికల మేనిఫెస్టోలో ఉచితాలను ప్రకటించడం సెక్షన్ 123 ప్రకారం అవినీతి చర్యలోకి రాదని, కానీ ఇది ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొంది. అయితే ఉచిత హామీలు రాష్ట్రాల ఆర్థిక సంక్షోభానికి కారణమవుతాయని సుప్రీం ఆనాడే హెచ్చరించింది. ఎన్నికల్లో ఉచితాలను హామీలుగా ఇవ్వడంపై అశ్వినికుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోనే ఉంది. తాజాగా తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే చేసిన ఉచిత విద్యుత్ వాగ్దానంపై సుప్రీంకోర్టు ఆసక్తికరంగా స్పందించింది.

పేదలకు ఉచిత విద్యుత్ ఇస్తాన్నామని పార్టీలు మొదట పేర్కొంటాయి. అయితే ఉచిత విద్యుత్ అందని వారు తమపై వివక్ష చూపుతున్నారంటూ ప్రభుత్వాలను విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి విమర్శలను తట్టుకోలేక అధికార పార్టీలు అన్ని వర్గాలకూ ఉచిత పథకాన్ని అమలు చేస్తున్నాయి. దీనివల్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై పెనుభారంతో పాటు ఖజానాలు ఖాళీ అవుతున్నాయని హెచ్చరించింది.

అయితే కొన్ని సంస్కరణల ద్వారా ఉచితాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశముంది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోల్లో ఉచితాలపై నియంత్రణ విధించడం, వాగ్దానాల్లో పారదర్శకత ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఉచిత హమీలు కురిపించడం వల్ల గతంలో శ్రీలంక, వెనిజులా వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఘటనలను ఉదాహరణగా వివరిస్తే నష్టాన్ని కొంతైనా నివారించొచ్చు.