12 July, 2026 | 1:09 PM

రాజకీయాలకు పోయి.. కరువు సమస్యను జఠిలం చేయొద్దు

12-07-2026 12:09 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. చెప్పేందుకు విషయం లేగనే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 31 నెలల్లో బూతులకు దిగారని, షాబాద్ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి,హోంమంత్రి మాత్రం ఇప్పటికీ స్పందించలేదని ఆరోపించారు.

షాబాద్ హత్య కేసులో నిందితుడికి రేవంత్ రెడ్డికి తేడా లేదని, నిన్న రేవంత్ రెడ్డి మాటలు చూస్తే అలానే అనిపించిందని తెలిపారు. ఇంత పెద్ద ఘటన జరిగితే, నిన్న మధ్యాహ్నం ఓ పోలీస్ ఉన్నతాధికారి గోల్ఫ్ ఆడుతూ టైమ్ పాస్ చేశాడు. ప్రశ్నించిన వాళ్ల రక్తం పారిస్తానని సీఎం అంటున్నారని, నీళ్ల విషయంలో ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే ఊరుకునేది లేదని హరీష్ రావు తెలిపారు.

కన్నెపల్లి పంప్ హౌస్ కటిక నొక్కమంటే విపక్షాల కంఠం నొక్కుతున్నారని, మేడిగడ్డ మీద సీఎం చెప్పేవన్నీ అవాస్తవాలు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ గేట్లు మూసివేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఎలా ఆన్ చేస్తారని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యం అని ఎద్దేవా చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి సోయి రాలేదన్నారు. 

మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి నీళ్లు ఎత్తిపోయవచ్చని ఇంజనీర్లు చెప్పారని, రూ.90 కోట్లతో కాపర్ డ్యామ్ నిర్మించి నీళ్లు ఎత్తిపోయవచ్చని హరీశ్ వెల్లడించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద హైదరాబాద్ సహా అనేక జిల్లాలు ఆధారపడ్డాయని, రాజకీయాలకు పోయి కరువు సమస్యను జఠిలం చేయొద్దని సూచించారు. బీఆర్ఎస్ పదేళ్లలో కొత్తగా 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని, కల్వకుర్తికి నీళ్లు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ గుర్తు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని ఆయన గుర్తు వ్యాఖ్యానించారు.