20-02-2026 12:00:00 AM
పుల్లెంల గణేష్ :
* ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా మరే ఇతరత్రా వాటిపై వందల, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ మౌలిక సదుపాయాలైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇండ్లు, ఉచిత భూమి అందనప్పుడు అది ప్రజాపాలనగా పిలవబడకపోగా సామాజిక న్యాయానికి వ్యతిరేకమవుతుంది.
భారతదేశం అంటేనే స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ప్రజాస్వామ్యం, గణతంత్ర విలువల సమాహారం. ఈ విలువలన్నిటికీ ప్రాణం పోసిం ది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాం గం. రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు. ఇది కోట్లాది పేదల, అణగారిన వర్గా ల, శ్రమజీవుల ఆశల ప్రతిబింబం. ఈ రాజ్యాంగ ఆత్మను ఆచరణలో పెట్టడమే నిజమైన ప్రజా పాలన.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నా యి. ‘ప్రజాపాలన’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 బడ్జెట్ ద్వారా సామాజిక న్యాయానికి స్పష్టమైన రూపం ఇవ్వాల్సిన చారిత్రక బాధ్యతను మోస్తోంది.
సామాజిక న్యాయం అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు.సామాజిక న్యాయమంటే రాష్ట్ర సంపదలో, భూమిలో, బడ్జెట్ వనరు ల్లో, విద్య, ఉపాధి, వ్యాపారాల్లో ప్రతి కులం, ప్రతి వర్గానికి వారి జనాభా దామా షా ప్రకారం సమాన వాటా ఉండటం.
రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 56 శాతం బడ్జెట్ వాటా లేకపోవడం, 18 నుంచి --20 శాతమున్న ఎస్సీలకు, 12 నుంచి --15 శాతమున్న ఎస్టీలకు, 10 శాతమున్న మైనార్టీలకు న్యాయమైన కేటాయిం పులు లేకుండా సామాజిక న్యాయం సాధ్యపడదు. కాబట్టి 2026-27 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ జనాభా దామాషా ప్రకారమే బీసీలు సహా అన్ని సామాజిక వర్గాలకు నిధులు కేటాయించాల్సిన అవసరముంది.
జనాభా ప్రాతిపదికన..
కాంగ్రెస్ పార్టీ కేవలం కామారెడ్డి డిక్లరేషన్‌ను ప్రాతిపదికగా తీసుకొని రాబోయే బడ్జెట్‌లో 20 వేల కోట్లు నిధులు ఇస్తే దాదాపు 130 కులాలు ఉన్న బీసీ అభివృద్ధికి ఆ నిధులు ఏమాత్రం సరిపోవు. బీసీలు రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్నందున మొత్తం బడ్జెట్‌లో 56 శాతం వాటాలో విద్య, ఉపాధి, వ్యాపార రుణాలు, వృత్తి ఆధారిత పథకాలు, బీసీ కార్పొరేషన్లకు గణనీయమైన నిధులు ఇవన్నీ 2026 బడ్జెట్ లో ప్రతిఫలించాల్సిన అవసరముంది.
చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం 18 నుంచి 20 శాతమున్న ఎస్సీలకు కనీసం 18 శాతం బడ్జెట్ కేటాయింపులతో పాటు ఉపాధి హామీ, భూమి పంపిణీ, విద్య, ఆరోగ్యం, నివాసంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక ఎస్టీల జనాభా దామాషా ప్రకారం 12 నుం చి 15 శాతం మేర నిధుల కేటాయింపుతో పాటు, అటవీ హక్కులు, పోడు భూముల కు చట్టబద్ధత, గిరిజన విద్యా, వైద్య సంస్థల బలోపేతం చేయాల్సిన అవసరముంది.
మత మైనార్టీలకు సుమారు 10 శాతం విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి న్యాయమైన వాటా, మతపరమైన వివక్ష లేకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభు త్వం రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కాదు, సంపద సృష్టి ఉండాలి. ఉన్న వనరులతో సంపద సృష్టించకుండా బడ్జెట్‌లోటు పేరుతో ప్రభుత్వ భూములు, సంస్థలను అమ్మడం ప్రజా వ్యతిరేక విధానమే అవుతుంది.
మాట నిలుపుకోవాలి..
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ముఖ్యంగా సం పద సృష్టి, పబ్లిక్ సెక్టార్ బలోపేతం, దీర్ఘకాలిక ఆదాయ మార్గాలు అనే దిశలో ఉంటే బాగుంటుంది. గృహ హక్కు అనేది మౌలిక హక్కు కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు సకాలం లో నిధుల కేటాయింపుతో పాటు; గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో పెండింగ్ ఇళ్ల పూర్తి, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబాలకు హామీ ఇచ్చిన 25 వేల గౌరవభృతి అనేవి బడ్జెట్‌లో స్పష్టంగా తెలియజెప్పాలి.
కార్మికులు, శ్రమజీవులు, ఆటో కార్మికులకు ఇస్తామన్నా రూ. 12 వేల ఆర్థిక సహాయం, కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి నెలవారీ పెన్షన్, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ఇవన్నీ ప్రజా పాలనలో భాగంగా ఉన్నాయి. వ్యవసా యం రంగాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆహార భద్రతకు పునా ది వేస్తూ వరంగల్ రైతు డిక్లరేషన్ చేసిన రేవంత్ సర్కార్ ఆ మాటను నిలుపుకోవాలి.
ఇచ్చిన హామీ మేరకు వరి పంటకు బోనస్, అన్ని ఆహార, వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. సొంత భూమి ఉన్న రైతులతో పాటు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాటి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల మేరకు రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేల రూపాయలు అర్హులందరికీ ఇచ్చేలా బడ్జె ట్లో నిధుల కేటాయింపు జరగాలి. పెండింగ్ ఉన్న రబీ సీజన్ రైతు భరోసా నిధులను త్వరగా విడుదల చేయాలి. అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ జరిగేలా 2026 బడ్జెట్‌లో నిధులను మంజూరు చేయాలి.
అభివృద్ధి అవసరం..
ఇక ప్రైవేటు విద్యా సంస్థలకు సకాలం లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం మూలంగా యజమాన్యాలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపినిచ్చిన దుస్థి తి నెలకొన్నది. కాబట్టి సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అయ్యేలా నిధులు కేటాయించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల లు కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ప్రైమరీ నుంచి ఉన్న త విద్య వరకు ఉచిత, నాణ్యమైన విద్య అం దేలా విద్యకు అధిక బడ్జెట్ కేటాయింపులు అవసరం.
ఆరోగ్యం పరంగా ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్న ప్రభుత్వం ఆ మాట ను నిలబెట్టుకుంటూనే ప్రభుత్వ ఆసుపత్రులను అత్యాధునికంగా అభివృద్ధి చేసేందు కు నిధులు కేటాయించాలి. అంతేకాదు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు ప్రభుత్వ వైద్యం ప్రతి పౌరుడికి అందించేలా వ్యవస్థను రూపుదిద్దాలి. దీనికి సరిపడా నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి.
ఉపాధి రంగం లో భాగంగా నిరుద్యోగ నిర్మూలన కోసం దాదాపు 20 లక్షల నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు అన్ని ప్రభుత్వ శాఖ ల్లో ఖాళీల భర్తీ కోసం ఉద్యోగ నోటిఫికేష న్లు విడుదల చేయాలి. వ్యవసాయ రంగం లో భాగంగా భూమి లేని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, అందులో భాగంగా ప్రభుత్వం దగ్గర ఉన్న భూముల కు తోడుగా ప్రైవేట్ భూముల సేకరించి భూమిలేని కుటుంబాలకు నీటి వసతితో పాటు సుమారు మూడు ఎకరాల పంపిణీ చేస్తే బాగుంటుంది.
బడ్జెట్ రూపకల్పన..
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, మిగతా 420 హామీలన్నీ అమలయ్యేలా 2026 బడ్జెట్‌లో తగిన నిధుల కేటాయింపులు జరిగితే బాగుంటుంది. 2026-27 తెలంగాణ బడ్జెట్ కేవ లం లెక్కల పుస్తకం కాదు.ఇది సామాజిక విప్లవానికి బాట వేసేలా, రాజ్యాంగ విలువల అమలు ఆచరణకి, కాంగ్రెస్ పార్టీ చెప్తు న్న ప్రజా పాలనకు నిజమైన పరీక్ష కాలం.
జనాభా దామాషా ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగితేనే తెలంగాణలో నిజమై న సామాజిక న్యాయం సాధ్యం అవుతుం ది. అదే ప్రజల ఆశ, అదే రాజ్యాంగ ఆత్మ. తెలంగాణలో మెజార్టీలో 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ ఎస్టీల జీవితాల్లో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా విప్లవాన్ని తీసుకొచ్చేలా 2026 బడ్జెట్ రూపకల్పన ఉండాలి. అంతేకానీ అగ్రకులాలకు, కార్పొరేట్ వ్యాపారస్తులకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన చేస్తే అది సామాజిక అన్యాయమే అవుతుంది.
కాబట్టి ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించకుండా మరే ఇతరత్రా వాటిపై వందల, వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ మౌలిక సదుపాయాలైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇండ్లు, ఉచిత భూమి అందనప్పుడు అది ప్రజాపాలనగా పిలవబడకపోగా సామాజిక న్యాయానికి వ్యతిరేక మవుతుంది. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి 2026-2027కి సంబంధించి బడ్జెట్ రూపకల్పన ఉండాలని మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
వ్యాసకర్త సెల్: 9553041549