12 July, 2026 | 12:34 PM

ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి: ఏఐటీయూసీ

12-07-2026 11:38 AM

మహాసభల కరపత్రాల ఆవిష్కరణ

తెలంగాణ ఆటో& ప్రైవేట్ మోటారు డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

కూసుమంచి,(విజయక్రాంతి): రవాణా రంగ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గుండెపంగు మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కూసుమంచి మండల పరిధిలోని, గైగోళ్లపల్లి గ్రామంలో ఆటో అడ్డ వద్ద జరిగిన ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ ప్రతిరోజు కోట్లాదిమంది ప్రజలను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆటో డ్రైవర్ల జీవితాలు నేడు తీవ్ర సంక్షేమలో కూరుకుపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ మారిన రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఆటో కార్మికుడు బతుకుల్లో వెలుగులో నిండడం లేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం వలన ఆటో కార్మికుల ఆదాయం సగానికి  పైగా పడిపోయి వారి కుటుంబాలు రోడ్డుపై పడ్డాయని అన్నారు. వెంటనే ఆటో డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని ప్రతి నెల రూ.5 వేల రూపాయల ఆర్థిక భృతి చెల్లించి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఆటో కార్మికులకు ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేసి ఆటోల ఫిట్నెస్ ఫీజులు లేటు ఫీజులు గ్రీన్ టాక్స్ భారాన్ని తగ్గించాలని అదేవిధంగా ఆటోలపై విధిస్తున్న భారీ చెల్లాలను పెనాల్టీలను పున:సమీక్షించాలని కోరారు. మన హక్కుల సాధన కోసం మన సమస్యల పరిష్కారం కోసం గల మెత్తడానికి ఈ నెల 17వ తేదీన ఖమ్మం నగరంలోని, ఎంబి ఫంక్షన్ హాల్ లో జరగబోతున్న సంఘం 8వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం మహాసభల కరపత్రాలను కార్మికులతో కలిసి ఆవిష్కరించారు.