గిరిజన యువతకు ఉచిత క్రికెట్ శిక్షణ
ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు సూచనకు స్పందించిన చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ
మే 1 నుంచి ప్రత్యేక ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం
భద్రాచలం,(విజయక్రాంతి): గిరిజన యువతి యువకుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారికి ఉన్నత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు చేపట్టిన ప్రత్యేక చొరవకు చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ సానుకూలంగా స్పందించింది. అకాడమీ నిర్వాహకుడు రంజిత్ మరియు ప్రధాన కోచ్ తేజ గిరిజన బాలబాలికలకు పూర్తిగా ఉచితంగా క్రికెట్ శిక్షణ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మే 1వ తేదీ నుంచి ప్రత్యేక సమ్మర్ క్రికెట్ క్యాంప్ నిర్వహించి భద్రాచలం డివిజన్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని గిరిజన యువతి యువకులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కోచ్ తేజ మాట్లాడుతూ... “ఎమ్మెల్యే వెంకట్ రావు గిరిజన యువత కోసం ఉచిత సమ్మర్ క్యాంప్ నిర్వహించాలని కోరారు. ఆ సూచనను గౌరవిస్తూ చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ కొనసాగుతున్నంత కాలం గిరిజన యువతకు పూర్తిగా ఉచిత శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు. కేవలం ఆట నేర్పడమే కాకుండా క్రీడాకారుల్లో క్రమశిక్షణ, ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, మానసిక ధైర్యం పెంపొందించేలా శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడినప్పటికీ ప్రతిభ కలిగిన పలువురు యువకులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని, తమ అకాడమీ నుంచి శిక్షణ పొందిన పలువురు అండర్-12, అండర్-14 విభాగాల్లో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారని వెల్లడించారు.
భవిష్యత్తులో గిరిజన యువకులు జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కోచ్ తేజ తెలిపారు. అదేవిధంగా శిక్షణ పొందే గిరిజన యువతి యువకులకు ఉచిత క్రికెట్ కిట్లు, స్పోర్ట్స్ దుస్తులు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సదుపాయాలు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభకు మరింత ప్రోత్సాహం లభించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గిరిజన క్రీడాకారులు రాణించే అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.






