25 April, 2026 | 4:04 AM

భూ ఆక్రమణ ఫోర్జరీ కేసులో నలుగురు నిందితుల అరెస్ట్

25-04-2026 02:06 AM

మేడ్చల్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి); రాంపల్లి గ్రామంలోని విలువైన భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించడానికి ప్రయత్నించిన ఘటనలో నలుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఫోర్జరీ, మాల్ప్రాక్టీస్ అక్రమ రుణాల సేకరణ వంటి అంశాలపై విచారణ జరిపి నిందితులను రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి గ్రామం, సర్వే నెం. 385 లోని ఫిర్యాదుదారు రేఖా రెడ్డి కుటుంబ సభ్యుల భూమిలోకి  సుబ్బారెడ్డి అతని అనుచరులు అక్రమంగా ప్రవేశించారు.అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్, బోర్ మోటార్ మరియు సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి భూ ఆక్రమణకు ప్రయత్నించారు.

సుబ్బారెడ్డి (A1), లోన్ ఏజెంట్ శ్రీధర్ రెడ్డి సలహా మేరకు రవి (A2), వెంకటేష్ (A3) సహాయంతో నకిలీ పత్రాలను తయారు చేయించాడు. జమ్మల నాగేష్ (A4) తనకు భూమి లేకపోయినప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో తన స్థానంలో మరొక గుర్తు తెలియని వ్యక్తిని ఫోటోలు  సంతకాల కోసం పంపి, కీసర ఎస్.ఆర్.ఓ కార్యాలయంతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు.ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా నిందితులు రూ. 73 లక్షల లోన్ పొంది ఆ మొత్తాన్ని పంచుకున్నారు.భూమి విలువ పెరగడంతో సుబ్బారెడ్డి అదే నకిలీ పత్రాలతో ఇతరులకు అగ్రిమెంట్లు చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, ఫిర్యాదుదారురాలిపైనే కౌంటర్ కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేశాడు.ఈ కేసులో సమగ్ర విచారణ జరిపిన ఏసీపీ జవహర్నగర్ చక్రపాణి, కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయలు, దర్యాప్తు అధికారి ఎస్.ఐ హరిప్రసాద్ మరియు సిబ్బందిని మల్కాజిగిరి డీసీపీ అభినందించారు.