28 August, 2026 | 12:35 AM

కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే

27-08-2026 10:52 PM

ఏడాది గడచిన మరమ్మతుల్లేవని ఆందోళన 

కామారెడ్డి లో ఫ్లడ్ వచ్చి  ఏడాది 

సీఎం ఇచ్చిన హామీలు నీటి మూటలే

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో తుఫాన్ వర్షాల ప్రభావంతో మూడు కాలనీలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని కలిగించి ఏడాది గడిచిన మరమ్మత్తులు చేపట్టలేదని బిఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో పిండ ప్రదానం చేశారు. ముఖ్యమంత్రి వచ్చి బాధితులను పరామర్శించి వెళ్లారు తప్ప ఇంతవరకు బాధితులను ఆదుకోలేదని, ధ్వంసమైన రోడ్ల మరమ్మత్తులు చేపట్టలేదని ఆందోళన నిర్వహించారు.

ప్రజల బాగోగులు పట్టని ముఖ్యమంత్రి హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సీఎం వచ్చి నష్టం పై సమీక్ష నిర్వహించి ఏడాది గడిచిన మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. ధ్వంసమైన రోడ్డు వద్ద పిండ ప్రదానం చేసి రోడ్డుపై  బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్డు డివైడర్లు, ఆరు వరుసల రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది అని వాటి మరమ్మతులు కనీసం చేపట్టలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి అలసత్వానికి నిరసనగా పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు. దెబ్బతిన్న రహదారి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతులు చేపట్టుకుంటే మరింత పోరాటం చేస్తామన్నారు. రహదారి పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.