22 May, 2026 | 10:49 AM

ఫుట్‌బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

22-05-2026 09:55 AM

పెబ్బేరు: ఫుట్‌బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేర్ ఖేలో ఇండియా ఫుట్‌బాల్ మైదానంలో ఏర్పాటు చేసిన నూతన ఫ్లడ్‌లైట్లను స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు గురువారం ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో రూ.10 లక్షల వ్యయంతో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న డ్రెస్సింగ్ రూమ్, జిమ్, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ “పెబ్బేరు అంటేనే ఫుట్‌బాల్ కేరాఫ్ అడ్రస్” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వనపర్తి నుంచి ఒకరైనా మెస్సీ స్థాయికి ఎదగాలని కోరారు. తొలుత వనపర్తి, పెబ్బేరు జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌ను అతిథులు ప్రారంభించగా, ఎమ్మెల్యే, కలెక్టర్, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ మైదానంలో ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.