22 May, 2026 | 10:49 AM

నాలుగు నెలల జీతాలు అడిగిన పాపానికి ఉద్యోగం ఊడింది..?

22-05-2026 09:59 AM

మనస్థాపంతో గడ్డి మందు తాగిన గ్రామపంచాయతీ కార్మికుడు

పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆసుపత్రి కి తరలింపు 

గద్వాల,(విజయక్రాంతి): గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామంలో తీవ్ర విషాద ఘటన గురువారం చోటు చేసుకుంది. గత ఏడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్న  రాజు అనే కార్మికుడు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వాలని గ్రామ సెక్రటరీ శంషాద్ బేగం , గ్రామ సర్పంచ్ ను పలుమార్లు వేడుకున్నాడు. అయితే ఆయనకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ పోషణ కష్టమవడం వల్ల తీవ్ర మనస్థాపానికి గురైన రాజు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌లో గద్వాల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పేద కార్మికుడి కష్టార్జిత జీతాలను నెలల తరబడి నిలిపివేసి, చివరకు ఉద్యోగం నుంచి తొలగించడం అమానుషమని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామ సెక్రటరీ శంషాద్ బేగం, సర్పంచ్ ల నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ ఘటన జరిగిందని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ , ఎంపీడీవో  తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.