22 May, 2026 | 11:10 AM

క్వారీ య‌జ‌మానిని బెదిరించిన వారిపై కేసు

22-05-2026 10:12 AM

జిన్నారం/ అమీన్‌పూర్‌, మే 22 :రాజ‌కీయ నాయ‌కుల‌మ‌ని, త‌మ‌కు రూ.కోటి ఇవ్వ‌కుంటే అంతుచూస్తామ‌ని బెదిరించిన వారిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు బొల్లారం పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేష‌న్ ఖాజీప‌ల్లి గ్రామ ప‌రిధిలో ఉన్న బిల్డ్‌మేట్ మెట‌ల్ శాండ్ ఇండ‌స్ట్రీ క్వారీలోకి ఈనెల 18న గ్రామానికి చెందిన అరికెల సురేశ్‌, అరికెల మ‌హేశ్‌, కుమ్మ‌రి జితేంద‌ర్‌, ర‌మేశ్‌తో పాటు కొంత‌మంది క‌లిసి అక్ర‌మంగా క్వారీలోకి ప్ర‌వేశించారు. అక్క‌డ ప‌నిచేస్తున్న వారిని బెదిరించి క్ర‌ష‌ర్ మిష‌న్ల‌ను బంద్ చేయ‌డ‌మే కాకుండా క్వారీ య‌జ‌మానికి ఫోన్ చేసి తాము ఈ మ‌ధ్య ఎన్నికై నాయ‌కుల‌మ‌ని, రూ.కోటి ఇవ్వ‌క‌పోతే క్వారీ మూసివేస్తామ‌ని హెచ్చ‌రించిన‌ట్లు తెలిపారు. క్వారీ య‌జ‌మాని వెంక‌ట ప్ర‌సాద్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా బొల్లారం పోలీస్ స్టేషన్ పరధిలో గల పరిశ్రమలు, క్వారీ, క్రషర్ ఇతర యాజమాన్యంకు ఇటువంటి బెదిరింపులు చేసే వారిపై ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామ‌ని సూచించారు.