‘లులూ’లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు
అపరిశుభ్రత, పురుగుల కారణంగా 150 కిలోల ఆహార పదార్థాలు సీజ్
గడువు ముగిసినా తప్పుడు లేబుళ్లతో ఉత్పత్తుల విక్రయం
పలు ఆహార నమూనాలు ల్యాబ్‌కు తరలింపు
కూకట్‌పల్లి, మే 19 (విజయక్రాంతి): కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధి కేపీహెచ్‌బీ కాలనీలో ప్రముఖ షాపింగ్ కేంద్రమైన లూలు హైపర్ మార్కెట్‌లో మంగళవారం తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం లూలు మాల్ హైపర్ మార్కెట్‌లో ఓ మహిళ తీసుకున్న మిక్షర్ పాకెట్‌లో బల్లి వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేయడం, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ తనిఖీల్లో పరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనలకు సంబంధించి తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్టోర్‌లోని వివిధ విభాగాల నుంచి పాడైన దాదాపు 150 కిలోల ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నిర్వహించిన ఈ తనిఖీల్లో హైపవర్ మార్కెట్‌లోని కిచెన్, రిటైల్ విభాగం, మాంసం విక్రయశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కిచెన్‌లో పరిశుభ్రత అత్యంత దారుణంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన ఆహారాన్ని కనుగొని, దాన్ని పారవేయించారు.
అంతేగాక ప్రాంగణంలో పురుగులు, కుళ్లిన కూరగాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గడువు తీరడానికి దగ్గరలో ఉన్న ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై చిరిగిన, తప్పుదోవ పట్టించే లేబుల్స్ ఉన్నట్లు కనుగొన్నారు.రిటైల్ విభాగంలోనూ శనగపిండి, గోధుమపిండి, పప్పులు వంటివాటిలో పురుగులు పట్టి ఉండటాన్ని అధికారులు గమనించారు. కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌పై గడువు ముగిసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సులను గుర్తించారు.
అనేక ఉత్పత్తులపై పోషక విలువల సమాచారం, తయారీదారుడి చిరునామా, సరైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ నంబర్ వంటి తప్పనిసరి వివరాలు లేకపోవడం గమనార్హం.ఈ తనిఖీ అనంతరం పురుగులు పట్టిన స్వీట్లు, వంట నూనెలు, పిండి, పప్పులతో సహా సుమారు 150 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కల్తీ, కృత్రిమ రంగుల వాడకం, పురుగుల కాలుష్యం వంటి అనుమానాలతో పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, తదుపరి విశ్లేషణ కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆహార పదార్థాలు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






