13 August, 2026 | 11:54 AM

సింగరేణి ఆధ్వర్యంలో సామాజిక చైతన్య నాటకోత్సవాలు

13-08-2026 11:24 AM

జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి 

ఆగస్టు 14 నుండి 16 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడి 

విజయవంతం చేయాలని పిలుపు

భూపాలపల్లిటౌన్, ఆగస్టు 13 (విజయక్రాంతి): సామాజిక చైతన్యం, సమానత్వం, మానవతా విలువలు, మహనీయుల ఆశయాలను ప్రజలలోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మూడు రోజులు సామాజిక చైతన్య నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ నాటకోత్సవాలు ఆగస్టు 14 నుంచి 16 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు స్థానిక క్రిష్ణకాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాలులో నిర్వహించనున్నట్లు తెలిపారు.

అందులో భాగముగా ఆగస్టు 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్(Dr. B.R. Ambedkar) జీవితం, ఆశయాలు, లక్ష్యాలను ప్రతిబింబించేలా “శరణం శరణం గచ్ఛామి” నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 15న మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల జీవిత పోరాటం, సామాజిక సంస్కరణలు, సమానత్వ సందేశాన్ని తెలియజేసే “సత్యశోధన” నాటకాన్ని, 16న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా ప్రస్థానం, బౌద్ధతత్వం వైపు ఆయన ప్రయాణాన్ని ప్రతిబింబించే “బుద్ధునితో నా ప్రయాణం” నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు రోజుల నాటకోత్సవాలకు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు, సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నాటక ప్రదర్శనలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జీఎం కోరారు.