13 August, 2026 | 12:01 PM

ప్రజల కోసం వచ్చిన సబ్సిడీ... కొందరి స్వార్థానికి బలికాకూడదు

13-08-2026 11:17 AM

సత్తుపల్లి, ఆగస్టు 13, (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందాలని, కొత్త పరిశ్రమలు స్థాపించి కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టాలని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సబ్సిడీ రూపంలో అందిస్తోంది. ఈ పథకం లక్ష్యం నిరుద్యోగులకు ఆశాకిరణంగా మారడం. కొత్త వ్యాపారాలకు ఊతమివ్వడం. అయితే, సత్తుపల్లి ప్రాంతంలో కొందరు దొంగ యూనిట్లు చూపించి, నకిలీ వివరాలతో లేదా అక్రమ మార్గాల్లో ఈఎ సబ్సిడీలు పొందుతున్నారనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే, అది కేవలం ప్రభుత్వాన్ని మోసం చేయడం మాత్రమే కాదు... నిజంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటున్న నిరుద్యోగ యువత భవిష్యత్తును దోచుకోవడమే అవుతుంది.

ప్రజల పన్నుల రూపంలో వచ్చిన ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికే ఖర్చు కావాలి. కానీ రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగం, అవినీతిపరులతో కుమ్మక్కై అర్హత లేని వారు సబ్సిడీలు పొందుతున్నారనే అనుమానాలు ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రజలు నాయకులను ఎన్నుకునేది అవినీతికి అండగా నిలవడానికి కాదు... ప్రజా ధనాన్ని కాపాడడానికి, నిజాయితీగా పాలన అందించడానికి. అందుకే ప్రజాప్రతినిధులు ఇటువంటి ఆరోపణలపై మౌనం వీడి, పారదర్శక దర్యాప్తుకు సహకరించాల్సిన బాధ్యత ఉంది. అలాగే బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖలు ప్రతి యూనిట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిజంగా పరిశ్రమ నడుస్తుందా లేదా అనే విషయాన్ని ధృవీకరించాలి. తప్పు చేసిన వారు ఎంతటి పలుకుబడి ఉన్నా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. ప్రజల్లో వినిపిస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.