26 April, 2026 | 3:43 AM

పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలపై దృష్టి

26-04-2026 12:36 AM
  1. ముందస్తు సాగు ప్రణాళికపై కసరత్తు
  2. ఈసారి ఎల్‌నీనో ప్రభావం.. తక్కువ వర్షపాతం
  3. డిమాండ్ ఉన్న సన్నవరి రకాలనే రైతులకు అందుబాటులో ఉంచాలి
  4. ఎరువుల ధరలను కేంద్రం రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది
  5. అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఉద్యాన, పప్పుధాన్యాల పంట ఉత్పత్తి సాగు పెంచడంపై దృష్టి సారించాలని, డిమాండ్ ఉన్న సన్నవరి రకాలనే రైతులకు అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ముందస్తు సాగు ప్రణాళికలపై అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

వచ్చే వర్షాకాలంలో ఎల్‌నీనో ప్రభావంపై వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉంటుదన్న వాతావరణశాఖ నిపుణుల అంచనాలతో ఉత్తర తెలం గాణాలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణ తెలంగాణలో అతి తక్కు వ వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉం దని వాతావారణ నిపుణులు మంత్రి తుమ్మలకు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మే 15 కల్లా వాతావరణ శాఖ నుంచి ఖచ్చితమైన నివేదిక తెప్పించుకొని, జిల్లాల వారీగా అక్కడి వాతావారణం, వర్షపాతాల అంచనాల ఆధారంగా రైతులు ఏయే పంటలు వేయాలో తెలిపే విధంగా సమగ్ర పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో కూరగాయల సాగు, పప్పు ధాన్యాలు, మిల్లెట్లు, నూనే గింజల వంటి పంటల సాగు విస్తీర్ణాలు గణనీయంగా తగ్గిపోయాయని మంత్రి పేర్కొన్నారు.

2013- సంవత్సరం నుంచి ఇప్పటీ వరకు సాగు వివరాలను గమనిస్తే వరిసాగు విస్తీర్ణం 131.7 శాతం పెరిగిందని, పప్పుధాన్యాలసాగు 39 శాతానికి తగ్గిందన్నారు. పెసళ్లు 75.2, మినుములు 71.5, ఉలవలు 71.6, సజ్జలు 95, బొబ్బర్లు 72.4, నువ్వులు 94.9, పొద్దుతిరుగుడు 98.5, ఆముదం 98.5, వేరుశనగసాగు 51 శాతానికి పడిపోయిందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో అనుకూలమైన సాగు పరిస్థితులున్నాయని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పప్పు ధాన్యాల సాగును పెంచాలని మంత్రి సూచించారు.

కూరగాయలు, పప్పుధాన్యాలు, మిల్లెట్లు, నూనె గింజల సాగును పెంచే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ, అగ్రికల్చర్ యూని వర్సిటీ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఒకే రకమైన పంటను ఎక్కువగా వేయడంతో భూమి సారం తగ్గడంతో పాటు, యూరియా వాడకం కూడా పెరుగుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్లో కాంప్లెక్స్ ఎరువుల ధర అధికంగా ఉండటం కూడా ఒక కారణమని మంత్రి అభిప్రాయపడ్డారు. 

కాంప్లెక్స్ ఎరువుల కన్నా, యూరియా ధరలు తక్కువకు దొరకడంతో రైతులు కాంప్లెక్స్ ఎరువులకు బదులు యూరియాను అధికంగా వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఎరువులు, యూరియా ధరలన్నింటినీ రేషనలైజ్ చేయాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు.

ఇప్పటివరకు సేకరించినధాన్యం, వచ్చేసీజన్‌లో ఎంత ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుందో అంచనా వేయాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జాన య్య, ఐఎండీ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.