వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 23 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను, రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
గురువారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆర్డీఓ లోకేశ్వర్ రావు, శిక్షణ ఉప కలెక్టర్ జాస్తిన్ జోన్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ మున్సిపల్ చైర్మన్లు మెంగ్రే ఆకాష్, పహీమ్ సుల్తానా, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 85.94 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తుందని, మిగిలిన 14.06 శాతాన్ని త్వరితగతిన పూర్తి చేసి 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల పరిధిలో ఇంకా పలువురు ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించలేదని, వారు బూత్ స్థాయి అధికారులకు ఫారాలు అందించకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.ఫారాలు సమర్పించని ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీలకు అందజేస్తామని, వారిని గుర్తించి ఫారాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఏఎస్డీ ఓటర్ల జాబితా తయారీ, మరణించిన వారు, గ్రామం విడిచి వెళ్లిన వారి వివరాల సేకరణ కూడా కొనసాగుతోందని తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.






