4 May, 2026 | 2:54 AM

ప్రధాన రహదారి పక్కన వ్యాపించిన మంటలు ..నిలిచిన రాకపోకలు

04-05-2026 01:43 AM

టేకులపల్లి, మే 3, (విజయక్రాంతి): ఇల్లందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై తొమ్మిదో మైల్ తండ సమీపంలో రహదారి పక్కన ఆదివారం మంటలు చెలరేగడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీనితో గంటల తరబడి వాహనాలు నిలిపివేసిన విషయం స్థానికంగా కలకలం రేపింది. ఇల్లెందు-కొత్తగూడెం రహదారి ప్రస్తుతం NH-930P జాతీయ రహదారిగా అప్గ్రేడ్ అవుతోంది. రోజూ వేలాది వాహనాలు, ముఖ్యంగా ఇసుక లారీలు, బొగ్గు లారీలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి.

ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, ఇరుకు మలుపుల వల్ల ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. తొమ్మిదో మైల్ తండ ఏరియాలో మంటలు చెలరేగడానికి కచ్చితమైన కారణం ఇంకా రాలేదు. మొక్కజొన్న పంట చెత్తకు నిప్పంటుకొని మంటలు వ్యాపించాయి. దీనికి తోడు గాలి దుమారం రావడంతో మరింత మంటలు విస్తరించాయి. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, రోడ్డు పక్కన చెత్త, ఎండుగడ్డి ఉండటం వల్ల చిన్న నిప్పురవ్వకైనా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ మంటల వల్ల భయపడి వాహనదారులు రోడ్డుపైనే ఆపేశారు. ఇసుక లారీలు 20-30 ఒకేసారి వెళ్లడం వల్ల చర్ల నుంచి ఇల్లెందు వరకు రోడ్డు జామ్ అవుతోంది. NH-930P గుంతల మయంగా ఉండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.