3 July, 2026 | 1:02 PM

పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా?.. చూద్దాం రండి.!

03-07-2026 12:22 PM

ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు

హైదరాబాద్: ఊకదంపుడు ఉపన్యాసాలు మాని స్పష్టంగా మాట్లాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఏదేదో మాట్లాడి అసలు విషయానికి జవాబు చెప్పడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కేటీఆర్ అసత్యాలు చెబతున్నారని మంత్రి జూపల్లి వెల్లడించారు. పదేళ్లలో వారు చేసిన అప్పులపై తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

అప్పులపై కేటీఆర్ ఒకలా, హరీశ్ రావు మరోలా చెబుతున్నారని సూచించారు. ప్రభుత్వం, ఎఫ్ఆర్ బీఎం, గ్యారంటీడ్ లోన్లు, నాన్ గ్యారంటీడ్ లోన్లు ఉంటాయని తెలిపారు. రూ. 8.21 లక్షల కోట్లు అప్పులున్నాయి.. కార్పొరేషన్ల పేరుతో మీరు చేసిన వాటిని అప్పులు కాక మరేమంటారు? అప్పులు చేయకుంటే వాటికి వడ్డీలు ఎందుకు కట్టారు? అని మంత్రి ప్రశ్నించారు. నేను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని జూపల్లి సవాల్ విసిరారు. మీరు చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

మిషన్ భగీరథకు మీరు చేసిన అప్పులు ఎవరు తీరుస్తారని ఫైర్ అయ్యారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చేందుకు తాను సిద్ధమని తెలిపారు. పాలమూరు పౌరుషమా.. కల్వకుంట్ల పౌరుషమా.. చూద్దాం రండి అని సవాల్ విసిరారు. సాయంత్రం 5 గంటలకు వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. మీరు చేసిన అప్పులను రుజువు చేస్తా రాజీనామా చేస్తారా... చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు నేను సిద్ధమన్నారు. ''పౌరుషం ఉంది కనుకే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేశా... ఏ విషయంలో అయినా మాటకు కట్టుబడి ఉంటా.. పక్కకు వెళ్లను. నిన్న గాంధీభవన్ లో పని ముగించుకుని గన్ పార్క్ వద్దకు వెళ్లా.. ఉద్యోగం, వ్యాపారం చేసి రాజకీయాల్లోకి వచ్చా.. మీలా రాలేదు.'' అని మంత్రి స్పష్టం చేశారు.

అడ్డగోలు మాటలు, ఆరోపణలు ఆపండి.. నేను చెప్పిన అంకెలకు మీ వివరణ పంపాలని మంత్రి జూపల్లి కేటీఆర్ ను కోరారు. పారిపోయే మనిషిని అయితే మళ్లీ ఎందుకు ప్రెస్ మీట్ పెడతా అన్నారు.  మీరేం చేస్తారో స్పష్టంగా చెప్పి ప్రెస్ మీట్ కు రావాలని సవాల్ చేస్తున్నా అన్నారు. ధైర్యం ఉంటే నేను చెప్పిన అంకెలు తప్పని కేసీఆర్ తో చెప్పించాలని డిమాండ్ చేశారు. పౌరుషం ఎవరికి ఉందో తేలిపోతుంది.. చర్చకు రండన్నారు. తాను చెప్పిన లెక్కలన్నీ కేటీఆర్, హరీశ్ రావు కు పంపిస్తున్నా.. స్పందించాలని కోరారు.

కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్ట్రంపై రూ.8.21 లక్షల కోట్ల భారం..

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర మొత్తం బకాయి అప్పు రూ.72,658 కోట్లు మాత్రమే ఉందని మంత్రి జూపల్లి నోట్ విడుదల చేశారు.  2023 డిసెంబర్ 1 నాటికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని వీడే సమయానికి రాష్ట్ర అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం రూ.8,21,651 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్రంపై మిగిల్చిందని ఆరోపించారు.