14 May, 2026 | 3:10 AM

లిఫ్ట్‌లో చిక్కుకొని ఐదేళ్ల చిన్నారి మృతి

14-05-2026 12:00 AM

శేరిలింగంపల్లి, మే 13 (విజయక్రాంతి): ఒక చిన్నారి ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో చిక్కుకొని మృతి చెందింది. గౌలిదొడ్డి ప్రాంతంలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వలస వచ్చి, హాస్టల్లో వంట పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.

ఆ కుటుంబానికి చెందిన 5 ఏళ్ల బాలిక బిస్తూ ఘోష్ స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5వ అంతస్తుకు వెళ్తుండగా, 3వ అంతస్తు వద్ద ఆమె జుట్టు లిఫ్ట్ డోర్ల మధ్య ఇరుక్కుపోయింది. లిఫ్ట్ పైకి కదలడంతో చిన్నారి తల దారుణంగా నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ప్రమాదం కేవలం కొన్ని సెకన్లలో జరిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వగా, పోలీసులు, హైడ్రా, ఫైర్ సర్వీసెస్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.