పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగు స్తంభాలు ఆధారంగా నిలుస్తా యి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తు న్నాయా, లేదా? అని పర్యవేక్షించే అత్యంత కీలకమైన బాధ్యత ‘మీడియా’ అనే నాలుగో స్తంభానిది.
అయితే, నేడు ఆ స్తంభం ఒరిగిపోతోందా? అక్షరాయుధం తన పదును కోల్పోయి వ్యాపార ప్రయోజనాల ముసుగులో బందీ అయిందా? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి. పత్రికా స్వేచ్ఛ అంటే జర్నలిస్టుల హక్కు మాత్రమే కాదు, అది సామాన్య పౌరుడికి తెలిసే నిజం హక్కు. కానీ, వర్తమాన కాలంలో ఆ స్వేచ్ఛ క్రమంగా అంతరించిపోతూ, ఒక అదృశ్య సెన్సార్షిప్ నీడలో మగ్గిపోతోంది.
విండ్‌హాక్ నుంచి ఐక్యరాజ్య సమితి వరకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం వెను క ఆఫ్రికా ఖండపు జర్నలిస్టుల పోరాట స్ఫూ ర్తి దాగి ఉంది. ఆఫ్రికాలోని పలు దేశాలలో పత్రికలపై ప్రభుత్వాల ఉక్కుపాదం కొనసాగుతున్న తరుణంలో, స్వేచ్ఛా వాణిని విని పించేందుకు ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991 ఏప్రిల్ 29 నుంచి మే 3 వరకు నమీబియాలోని విండ్‌హాక్ నగరంలో ఒక చారిత్రక సమావేశాన్ని నిర్వహించారు.
పత్రికా స్వేచ్ఛ కు పునాదిగా పిలిచే ‘విండ్‌హాక్ డిక్లరేషన్’ ఇక్కడే రూపుదిద్దుకుంది. దీని స్మారకార్థం, 1993 డిసెంబర్‌లో ఐరాస సర్వసభ్య సమావేశం మే 3వ తేదీని ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’గా ప్రకటించింది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19వ అధికరణం ప్రకారం ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందన్న సూత్రాన్ని ఇది పునరుద్ఘాటిస్తుంది. భారతదేశంలో కూడా నవంబరు 16ను ‘జాతీయ పత్రికా దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. అయితే, ఈ ఆచారబద్ధమై న వేడుకలు జరుపుకొంటున్న కొద్దీ క్షేత్రస్థాయిలో స్వేచ్ఛా పరిధి కుంచించుకుపోతుం డటం విచారకరం.
భారతదేశంలో మీడియా చరిత్రను గమనిస్తే స్పష్టమైన రెండు కోణాలు కనిపిస్తాయి. స్వాతంత్య్రానికి పూర్వం పత్రికలు ఒక తపస్సుగా, ఉద్యమంగా నడిచాయి. రాజా రా మ్మోహన్‌రాయ్ నుంచి మహాత్మాగాంధీ వరకు చాలామంది మహనీయులు పత్రికలను ఆయుధాలుగా మలిచారు. అప్పట్లో పత్రికల ధ్యేయం బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి దేశానికి విముక్తి కల్పించడమే. సంపాదకులు తమ ఆస్తులను హారతి కర్పూరంలా కరిగించి మరీ వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కానీ, నేడు పరిస్థితి తలకిందులైంది.
ప్రస్తుతం మీడియా సంస్థల యాజమాన్యాల్లో భారీ మార్పులు వచ్చాయి. నిబద్ధత గల సంపాదకుల స్థానంలో కార్పొరేట్ దిగ్గజాలు, గుత్త పెట్టుబడిదారులు పత్రికలు, టీ వీ ఛానళ్లను కైవసం చేసుకున్నారు. మీడియాను ఒక కవచంగా వాడుకుంటూ తమ ఇతర వ్యాపారాలను కాపాడుకోవడం నేటి యజమానులకు అలవాటుగా మారింది. సంపాదకుడికి ఉండాల్సిన కనీస స్వేచ్ఛను యజమానులు హరిస్తున్నారు.
యజమాని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలను వండటం, వార్తలను అణచివేయ డం నిత్యకృత్యమైంది. రాజకీయ నేతలే స్వ యంగా మీడియా సంస్థలను నడపడం వల్ల, ప్రత్యర్థి పార్టీలపై విషం చిమ్మడానికి, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వార్తా మాధ్యమాలు వేదికలవుతున్నాయి.
1975లో విధించిన ఎమర్జెన్సీ కాలంలో పత్రికలపై ప్రత్యక్ష సెన్సార్షిప్ ఉండేది. వార్తలను ముద్రించే ముందే ప్రభుత్వం అనుమ తి తీసుకోవాల్సి వచ్చేది. కానీ, నేడు ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ నడుస్తోంది. పాలక పక్షాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే, ప్రభుత్వ ప్రకటనలను నిలిపివేసి ఆర్థిక మూలాలను దెబ్బతీ యడం, టీవీ ఛానళ్ల ప్రసారాలను కేబుల్ ఆపరేటర్ల ద్వారా అడ్డుకోవడం వంటి పరోక్ష పద్ధతులను అవలంబిస్తున్నారు.
తద్వారా మీడియా సంస్థలను తమ అడుగులకు మ డుగులు ఒత్తేలా లొంగదీసుకుంటున్నారు. విమర్శించే గొంతుకలపై దేశద్రోహం వంటి కేసులు బనాయించడం, ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వా మ్య ఆరోగ్యానికి చేటు కలిగించే పరిణామాలని చెప్పవచ్చు.
ప్రధాన స్రవంతి మీడియాను పక్కనపెడితే, నేడు సోషల్ మీడియా ఒక పెను సవాలుగా మారింది. హిట్లర్ ప్రచార మంత్రి గోబెల్స్ సిద్ధాంతం ప్రకారం ‘ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే అది నిజమవుతుంది’. నేటి వాట్సాప్ యూనివర్సిటీలు, ఫేస్‌బుక్ గ్రూపులు ఈ సూత్రాన్ని అక్షరాలా అమలు చేస్తున్నాయి. వాస్తవాలను వక్రీకరించడం, ఫొటోల మార్ఫింగ్, ద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తిచేయడం ద్వారా సమాజంలో అశాంతిని రేపుతున్నారు.
నిజమైన వార్త మూడు అడుగులు వేసేలోపు, అబద్ధం ము ప్పు అడుగుల దూరం ప్రయాణిస్తోంది. గం దరగోళంలో ఉన్న ప్రజలు ఏది నిజమో, ఏది నకిలీ వార్తో తెలుసుకోలేకపోతున్నారు. ఈ విషవలయంలో ప్రధాన మీడియా సం స్థలు కూడా చిక్కుకొని, సోషల్ మీడియాలో వచ్చే వైరల్ సమాచారాన్ని నిజమో, కాదో తేల్చకుండానే ప్రసారం చేయడం జర్నలిజం విలువలను దిగజారుస్తోంది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో భారతదేశం స్థానం ఆందోళనకరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఈ సూచీలో వెనుకబడిపోతోంది. మొత్తం 180 దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానం కంటే దిగువకు పడిపోవడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనకు గర్వకా రణం కాదు. జర్నలిస్టులపై దాడులు, హత్య లు, బెదిరింపులు పెరుగుతున్న దేశాల జాబితాలో భారత్ చేరడం గమనార్హం. కేవలం రాజకీయాలే కాకుండా, మతపరమైన ఉన్మా దం, కార్పొరేట్ మాఫియా కూడా జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తున్నాయి.
భారతదేశంలో 1956లో ఏర్పాటు చేసిన తొలి ప్రెస్ కమిషన్ సిఫారసుల మేరకు 1966 నవంబరు 16న ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ఏర్పడింది. దీనికి ప్రభుత్వంపై కూడా తన అధికారాన్ని వినియోగించే అరుదైన అవకాశం ఉంది.
అయితే, ప్రెస్ కౌన్సిల్ కు సూచనలు చేసే అధికారం మాత్రమే కాకుండా, నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టబద్ధమైన పదునైన అధికారాలు ఉండాలి. జర్నలిస్టులు కూడా తమ వృత్తి ధర్మాన్ని విస్మరించకుం డా, నిష్పక్షపాతంగా ఉండాలి. ‘వార్త’ అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం, ‘వ్యాసం’ అంటే త మ అభిప్రాయాలను జోడించడం అనే ప్రా థమిక సూత్రాన్ని నేటి మీడియా విస్మరిస్తోంది.
పత్రికా స్వేచ్ఛ అనేది కేవలం జర్నలిస్టుల సమస్య కాదు, అది యావత్ సమాజపు స మస్య. పక్షపాత మీడియా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. వార్తను వ్యాపార సరుకుగా చూడకుండా, అణగారిన వర్గాల గొం తుకగా చూడాల్సిన బాధ్యత యజమానులపై ఉంది. మే 3న సభలు, సమావే శాలకే పరిమితం కాకుండా, మీడియా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛాయుతమైన, జవాబుదారీతనంతో కూడిన మీడియా ఉన్నప్పుడే ప్రజాస్వామ్య సౌధం పదిలంగా ఉంటుంది. అప్పుడే ‘అందరికీ అందుబాటులో నిజమైన స్వేచ్ఛ’ సాధ్యమవుతుంది.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల






