మతసామరస్యానికి ప్రతీక మొహరం పండుగ
తుంగతుర్తి,(విజయక్రాంతి): అసై.. దూల హారతి అంటూ అమరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించే మొహర్రం పండుగ వేడుకలు మండల పరిధిలోని పసునూరు పస్తాల నాగారం గ్రామాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పీర్లను నిలబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.పీర్లను ప్రతిష్టించడం, ఊరేగింపుల్లో హిందువులు సైతం ముస్లింలతో సమానంగా పాల్గొనడం ఈ పండుగ ప్రత్యేకత. కుల, మతాలకతీతంగా హిందూ, ముస్లింలు కలిసి జరుపుకునే ఈ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.
అలావా ఆటే ప్రత్యేక ఆకర్షణ.పీర్ల పండుగలో అలావా ఆట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. పెద్ద కట్టెలతో వెలిగించిన అలావా చుట్టూ తిరుగుతూ పాటలు పాడటం ఆనవాయితీ. మూడురోజుల పాటు రాత్రి వేళల్లో గ్రామస్థులు అలావా ఆడుతుండగా, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ రోజుల్లో పీర్లను దర్శించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, పిల్లలకు క్షేమం అని ప్రజలు నమ్ముతారు.






