ఫీజుల పరేషాన్
- రాష్ట్రంలో రీయింబర్స్‌మెంట్ సంక్షోభం..లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
- సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కోల్పోతున్న యువత
- పేద కుటుంబాలపై అదనపు భారం
- మానసిక ఒత్తిడిలో విద్యార్థులు
- ఆందోళన బాట పట్టిన విద్యార్థిసంఘాలు
ఒడువని వేదన
తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్య విద్యార్థులను పట్టి పీడిస్తున్నది. ఒకప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యకు అండగా నిలిచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇప్పుడు నిధుల కొరత, బకాయిల పేరుకుపోవడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో విద్యార్థులు మానసిక క్షోభ పడుతున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు సుమారు రూ.8 వేల కోట్లకు పైగా ఉన్నాయని విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి సంఘా లు చెబుతున్నాయి. ప్రభుత్వం విడతల వారీగా కొంత నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, పెండింగ్ బకాయిలు మాత్రం తగ్గడం లేదని విమర్శలు వినిపిస్తున్నా యి.
దీని ప్రభావం కేవలం ప్రైవేటు కళాశాలల ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాదు... లక్షలాది మంది విద్యార్థుల విద్య, ఉద్యోగాలు, ఉన్నత చదువులు, కుటుంబాల ఆర్థికస్థితి, మానసిక పరిస్థితిపై కూడా తీవ్రంగా పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఎంబీ ఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చదువుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడే చదువుకుంటున్నారు. అయితే బకాయిలు పేరుకుపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగామారుతోంది.
అదనపు భారం..
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడమే. కానీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఇప్పుడు అదే కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందనే నమ్మకంతో పిల్లలను ఇంజినీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో చేర్పించిన తల్లిదండ్రులు, ఇప్పుడు కళాశాలల నుంచి వస్తున్న ఫీజు ఒత్తిడిని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.
వ్యవసాయం, కూలి పనులు, చిన్నచిన్న వ్యాపారాలపై ఆధారపడే కుటుంబాలకు లక్షల్లో ఉండే ఫీజులను ఒకేసారి చెల్లించడం అసాధ్యంగా మారుతోంది. కొన్ని కుటుంబాల్లో పిల్లల చదువు కొనసాగించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇది పేదరికం నుంచి బయటపడేందుకు విద్యను ఒక మార్గంగా భావించే కుటుంబాల ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం కావడం వల్ల ఎక్కువ నష్టపోతున్నది ఆర్థికంగా బలహీన వర్గాలే. ఆర్థికంగా స్థోమత ఉన్న కుటుంబాలు ఫీజులు చెల్లించి చదువులు కొనసాగించగలిగినా, పేద కుటుంబాల పిల్లలు మాత్రం అదే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా విద్యలో సామాజిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం బకాయిలను సకాలంలో విడుదల చేస్తేనే పథకం అసలు లక్ష్యం నెరవేరుతుందని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
సర్టిఫికెట్లు లేక..
ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు అందకపోవడంతో కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, కన్సాలిడేటెడ్ మార్కుల మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఎంపికైన విద్యార్థులు కంపెనీలు నిర్ణయించిన గడువులోపు సర్టిఫికెట్లు సమర్పించలేక ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం ఐటీ, ఫార్మా, తయారీ, బ్యాంకింగ్ వంటి రంగాల్లో నియామకాల సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తప్పనిసరి.
అయితే సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగ ఆఫర్లు వచ్చినా జాయిన్ కాలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అదనపు గడువు ఇచ్చినా, మరికొన్ని సంస్థలు నేరుగా ఆఫర్లను రద్దు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోతే నియామక ప్రక్రియ ఆలస్యం కావడం లేదా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
విదేశీ విద్య, పీజీ అడ్మిషన్లు, స్కాలరిషప్‌ల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కూడా అవసరమైన పత్రాలు సమర్పించలేక అవకాశాలు చేజార్చుకుంటున్నారు. కష్టపడి చదివి డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు, ఫీజు బకాయిల కారణంగా సర్టిఫికెట్లు అందక కెరీర్ ప్రారంభ దశలోనే ఆటంకాలు ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది.
విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తూ, ఫీజు బకాయిలు ఉన్నా విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరగడం వల్ల ప్రభావం కేవలం విద్యార్థులకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థపైనా పడుతోంది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందకపోవడంతో కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీం తో కొత్త కోర్సులు ప్రారంభించడం, అధ్యాపకులను నియమించడం, మౌలిక సదుపా ను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలను వాయిదా వేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలపై అనిశ్చితి కొనసాగితే, కొన్ని కళాశాలలు ఈ పథకం కింద విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో వెనుకంజ వేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మానసిక ఒత్తిడిలో విద్యార్థులు..
ఫీజు బకాయిలు ఆర్థిక సమస్యగానే కాకుండా విద్యార్థుల మానసిక పరిస్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయం లో ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం నుంచి ఫీజులు ఎప్పుడు విడు దల అవుతాయో తెలియకపోవడం, కళాశాలల నుంచి నిరంతరం ఫీజులు చెల్లించాలనే ఒత్తిడి రావడం వల్ల చాలా మంది విద్యార్థులు ఒత్తిడితో సతమతమవుతున్నారు.
సెమిస్టర్ పరీక్షలు, ప్రాజెక్టులు, క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన సమయంలో ఫీజుల సమస్య వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. మరోవైపు తల్లిదండ్రులు తమ కోసం అప్పులు చేస్తున్నారని తెలిసి చాలామంది విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా ఉండాలనే ఉద్దేశంతో కొందరు చదువుతో పాటు పార్ట్‌మైమ్ ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు ఉన్నత చదువుల ఆలోచననే విరమించుకుంటున్నారు.
విద్యార్థుల్లో ఆశలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచాల్సిన ఉన్నత విద్య దశలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా ఒత్తిడి, అనిశ్చితి, నిరాశకు దారితీస్తే అది సమాజంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. బకాయిలను సకాలంలో విడుదల చేయడంతో పాటు, ఫీజుల కారణంగా ఏ విద్యార్థిపైనా ఒత్తిడి లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళనలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బకాయిల పేరుతో ఏ విద్యార్థి సర్టిఫికెట్లను కూడా కళాశాలలు నిలిపివేయకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నాయి.
ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ వంటి వివిధ విద్యార్థి సంఘాలు ఇప్పటికే పలు జిల్లాల్లో నిరసనలు, ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడులు నిర్వహించాయి. ప్రభుత్వం స్పందించకపోతే పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి. ఏటా ఫీజు విడుదలకు నిర్దిష్ట క్యాలెండర్ ప్రకటించాలని, స్కాలర్‌షిప్‌లు, మెస్ చార్జీలు కూడా సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే ఫీజు బకాయిల కారణంగా పరీక్షలు, సర్టిఫికెట్లు, అడ్మిషన్లపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉండటంతో రాజకీయంగానూ కీలకంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ క్యాలెండర్, పోటీ పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై యువతలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఫీజు బకాయిలు మరో ప్రధాన చర్చగా మారాయి.
ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అజెండాగా తీసుకుంటున్నాయి. విద్యార్థుల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రభుత్వానికి రాజకీయంగా, పాలనాపరంగా సవాల్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






