6 August, 2026 | 2:11 AM

నకిలీ ఫైర్ ఎన్‌వోసీలు!

06-08-2026 01:38 AM
  1. ఇంటర్ బోర్డుకు 52 జూనియర్ కాలేజీల బురిడీ
  2. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీకి గురైంది. ఫైర్ ఎన్‌వోసీ (నోఅబ్జక్షన్ సర్టిఫికెట్)లపై ఆయన సంతకం ఫోర్జరీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎనిమిది ప్రైవేట్ కళాశాలలు హైడ్రా కమిషనర్ రంగనాథ్, సహా ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్‌వోసీలను ఇంటర్ బోర్డుకు అందించాయి. ఈ ఘటనపై హైడ్రా అదనపు డైరెక్టర్ ఫిర్యాదుతో లేక్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మరోవైపు ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. మరో 60 కళాశాలల ఎన్‌వోసీలను కూడా హైడ్రా అధికారులు పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. అయితే తొలుత 8 కాలేజీలే హైడ్రా కమిషనర్ సంతంకం ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీలను ఇంటర్ బోర్డు కు సమర్పించినట్లుగా గుర్తించారు. కానీ మొత్తం 52 జూనియర్ కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను సమర్పించినట్లుగా హైడ్రా అధికారులు గుర్తించి నట్లు సమాచారం.

పలువురి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన ఈ వ్యవహారంలో సూత్రదారులెవరనే కోణంలో అధికారులు మరింత లోతు గా విచారణ జరుపుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరంలో ఆయా కళాశాలలు తప్పనిసరిగా అఫిలియేషన్ గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సంబంధిత ధ్రువపత్రాలతోపాటు ఫైర్ ఎన్‌వోసీని కూడా సమర్పించాల్సి ఉంటుంది.

తాజాగా ఓ కళాశాల యాజమాన్యం సమర్పించిన ఎన్‌వోసీపై అనుమానాలు వ్యక్తం కావడంతో హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించగా పత్రాల్లోని సంతకాలు ఫోర్జరీ అయినట్టు బయటపడింది. ఇంటర్ బోర్డుల్లోని అధికా రులు కూడా ఇందులో ఎవరైనా ఉన్నా రా? అని విచారణ జరుపుతున్నారు. ఉన్నతాధికారుల సంతకాల ఫోర్జరీకి పాల్పడిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని హైడ్రా అధికారులు ఇంటర్‌బోర్డును కోరారు. విద్యార్థి సంఘాలు కూడా వాటి గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.