6 August, 2026 | 2:47 AM

రాష్ట్ర ప్రయోజనాలు ఏపీకి తాకట్టు

06-08-2026 01:47 AM
  1.    18న జరిగే జీఆర్‌ఎంబీ సమావేశం ఏపీ కోసమే 
  2. ఏడు ప్రాజెక్టుల అనుమతులను రద్దుచేయాలని ఏపీ ప్రతిపాదన 
  3. గురుదక్షిణ కోసమేనా రేవంత్‌రెడ్డి మౌనం 
  4. మాజీమంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): తెలంగాణ సాగు, తాగు నీటిని ప్రయోజనాలను పణంగా పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడంలేదని మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈనెల 18న జరిగే జీఆర్‌ఎంబీ సమావేశం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగు తున్నట్లుగా ఉందనే అనుమానాలున్నాయని తెలిపారు. ఏడు ప్రాజెక్టుల అనుమ తులను రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు.

అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అనుమతులు రద్దు అంటే సగం తెలంగాణకు అన్యాయమే జరుగుతుందన్నారు. కొత్తగా అనుమతులు ఇవ్వాలని కాదు.. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ కోరుతోందన్నారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే.. రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకు ఉన్నారని, చంద్రబా బు అంటే భయమా? లేక గురు దక్షిణ కోసమేనా ఈ మౌనమని నిలదీశారు.

రాష్ట్ర ప్ర యోజనాలను కాపాడే బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలకు లేదా? అ ని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాజీమం త్రి హరీశ్ రావు మాట్లాడారు. ఏపీ ప్రతి పాదిం చిన అంశాలు చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరి కడుపు మండక మా నదని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను పటాపంచలు చేయాల్సిన రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు లేఖ రాశారు..

ఏప్రిల్ 24, 2026న తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, ఇప్పుడు అదే ప్రాజెక్టులను ఆపేలా జీఆర్‌ఎంబీ ఎజెండాలో అంశాలను పెట్టించారని మండిపడ్డారు.మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోయిందన్నారు. కేంద్రాన్ని చేతుల్లో పెట్టుకుని తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారని, నోటికాడి బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సీతారామ అంటే ఖమ్మం జిల్లా.. కాళేశ్వరం అంటే సగం తెలంగాణ.. గూడెం అంటే మంచిర్యాల.. మోదికుంట వాగు అంటే ఖమ్మం.. చిన్న కాళేశ్వరం అంటే మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గమని వెల్లడించారు. ఆయా ప్రాంతాల మంత్రులు, ముఖ్యమంత్రి దీనికి అంగీకరిస్తున్నారా? సమాధానం చెప్పాలన్నారు. 

కేంద్రానికి ఎలా నిర్దేశాలిస్తుంది..

జీఆర్‌ఎంబీ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఒక బోర్డు మాత్రమేనని, జీఆర్‌ఎంబీ కేంద్ర ప్రభుత్వానికి ఎలా నిర్దేశాలు ఇస్తుందన్నారు. కేంద్రంలోని అన్ని కీలక విభాగాలు పరిశీలించిన తర్వాతే తెలంగాణ ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులు ఇచ్చిందని చెప్పారు. టీఏసీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఉంటాయని, కేంద్రం పరిశీలించి అనుమతించిన తర్వాత వాటిని మళ్లీ రద్దు చేయాలని చెప్పే అధికారం జీఆర్‌ఎంబీకి ఎక్కడిదన్నారు.

బీజేపీ ఇప్పటికైనా స్పందించాలని, లేదంటే తెలంగాణ ప్రయోజనాల కోసం తామే పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మక్కకు అనుమతి ఇస్తే పోలవరానికి నీళ్లు తగ్గుతాయని ఏపీ ఎజెండాలో పేర్కొంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు ప్రభుత్వమే చెబుతోందని, గోదావరి--బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తామంటున్నారని వెల్లడించారు.

మరోవైపు తెలంగాణకు దక్కాల్సిన 968 టీఎంసీలలో భాగంగా సమ్మక్క ప్రాజెక్టు నిర్మిస్తా మంటే ఏపీ అడ్డుకుంటోందన్నారు. సమ్మక్క సాగర్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు వస్తాయన్నారు. అలాంటి ప్రాజెక్టును రద్దు చేయాలని ఎజెండాలో ప్రతిపాదిస్తుంటే నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తున్నారన్నారు. 

ఎజెండాను రద్దు చేయాలి

ఈ ఎజెండాను వెంటనే రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశంపై పోరాటం చేయాలన్నారు. తాము అడిగిన తర్వాత నిన్నటి తేదీ వేసి ఉత్తరం రాయడం కాదు... నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. డ్రామాలు కాదు... తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడాలని కోరారు. 

ఏపీకి తాకట్టు పెట్టారా?

తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా అన్నారు. చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే... రేవంత్ రెడ్డి రక్తం ఎందుకు మరగడం లేదని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవం లేదా? గురుదక్షిణ కోసమేనా ఈ మౌనమా అన్నారు. రాక్షస భాష మాట్లాడే రేవంత్ రెడ్డి... చంద్రబాబు విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు అంటే అంత భయమా అన్నారు.

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మొత్తం విషం చిమ్మిందని ఆరోపించారు. చంద్రబాబు తె లంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదేపదే చెబుతారు.. కానీ జీఆర్‌ఎంబీ ముందు పెట్టిన ఎజెండా చూస్తే అసలు నిజం ఏంటో అర్థమవుతుందన్నారు. కాళేశ్వ రం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోందన్నారు.

సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతోందన్నారు. ఆ ప్రతిపాదనను జీఆర్‌ఎంబీ ఎజెండాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన విషయమన్నారు. సీతారామ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోందన్నారు.