8 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాలి
- బీసీ విద్యార్థి సంఘాల డిమాండ్
- ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడి
- హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): గత మూడు సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజుల బకాయిలు 8 వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వందల మంది విద్యార్థులు శనివారం రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్, బీసీ యువజన సంఘం అధ్యకుడు జిల్లపల్లి నాయకత్వంలో ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడించారు.
హాజరైన ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు, ప్రజాసంఘాలు.. విద్యార్థుల సమస్యపై పోరాడాలని కోరారు. ఇది 10 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాల జీవన పోరాటమన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తయిన వేలాది మంది విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు.
విద్యార్థులు కాలేజీల చుట్టూ, నాయకుల చుట్టూ పార్టీల చుట్టూ సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యార్థులు ప్రాధేయపడుతూ ప్రదక్షణలు చేస్తున్నారన్నారు. ముట్టడి కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ యాదవ్, వ్రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యకులు జిల్లపల్లి అంజి. రాజేందర్, అనంతయ్య, గుజ్జ కృష్ణ, అంజి, సిద్దు యాదవ్, వంశీ యాదవ్, బలరాం, నరేష్ గౌడ్, బాలయ్య, చిల్లర యశ్వంత్, పవన్, నికిత, యామిని తదితరులు పాల్గొన్నారు.






