1 May, 2026 | 5:43 AM

ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే

01-05-2026 12:28 AM

బీజేపీకి అనుకూల ఫలితాలు

కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్, బీఆర్‌ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యం

10న మోదీ సభతో దిశా నిర్దేశం

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్

కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బీజేపీకి ఉన్న నివేదిక, అంచనాలకు అనుగుణంగా గణనీయ విజయాలు సాధిస్తుందని, అంచనాలకు మించిన ఫలితాలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలికేలా ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్నారని చెప్పారు. ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ  జరుగుతుందని తెలిపారు.

చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్, ఇండియా కూటమి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసేలా సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది హాజరవుతారని, ఇది తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే సభగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని ఎలా నడపాలో అర్థంకాని స్థితిలో పాలన కొనసాగిస్తుందన్నారు. 

బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు వీఆర్‌ఎస్ ఇచ్చారని, ఆ పార్టీ అవుట్ డేటెడ్ పార్టీ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కరీంనగర్‌లో తొలి మేయర్‌గా బీజేపీ అభ్యర్థి గెలవడం ప్రజల్లో మార్పునకు సంకేతమని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్‌రావు, పార్టీ కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.