అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం(Cheemakurthi Mandal) అగ్రహారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కన్నతండ్రి ముగ్గురు కుమార్తెలకు ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీశాడు. మృతిచెందిన కుమారైలు గోచిత(13), పూజిత(11), లోకితశ్రీ(8)గా గుర్తించారు. ముగ్గురు బిడ్డలకు విషమిచ్చిన తండ్రి సుధాకర్(35) అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్య వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు లోనైన సుధాకర్ కన్న కూతుళ్ల పట్ల కాలయముడయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల వల్లే తండ్రి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






