28 March, 2026 | 4:21 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

28-03-2026 12:28 AM

ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని మక్కలు విక్రయించాలి 

మహబూబాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్లలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తుందని చెప్పారు. రైతులకు సాగు పెట్టుబడి రైతు భరోసా ఇవ్వడంతో పాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో మక్కలను విక్రయించి క్వింటాలుకు 2400 రూపాయలు చొప్పున రైతులు గిట్టుబాటు ధర పొందాలని కోరారు. మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా పాలకమండలి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ల చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్ నాయక్, గంటా సంజీవరెడ్డి, మహబూబాబాద్ కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్లు జ్యోతి రమేష్, సునీత వెంకన్న, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.