7 July, 2026 | 1:41 PM

భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం సంతాపం

07-07-2026 12:37 PM

యాదాద్రి: భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి కన్నుమూశారు. కొమ్మిడి నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి(Bhongir MLA Kommidi Narasimha Reddy) తుదిశ్వాస వరకు నీతినిజాయితీతో జీవించారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాలను నిర్వహించి నిత్యం ప్రజల పక్షాన నిలిచారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 

భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా స్మరించుకున్నారు. 1978, 1983 సంవత్సరాల్లో రెండుసార్లు భువనగిరి నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని పేర్కొన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడిన నర్సింహారెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని సీఎం తెలిపారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.