21 April, 2026 | 3:58 AM

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎప్పుడో?

21-04-2026 01:01 AM

కోనరావుపేట ఏప్రిల్ 20 (విజయక్రాంతి): కోనరావుపేట మండలంలో ధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతుల సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఆరగాళ్లు కష్టపడి పండించిన పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా, అక్కడ ఎలాంటి కొనుగోలు చర్యలు లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

పంట పండించేవరకు ఒక కష్టం.. అమ్ముకునే సమయానికి మరొక కష్టం అని రైతులు తమ గోస వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో రైతులు కేంద్రాల ప్రాంగణాల్లోనే ధాన్యాన్ని పోసి ఆరబెట్టి భద్రపరిస్తూ రోజులు గడుపుతున్నారు.

సరైన షెడ్లు, తాగునీరు, విశ్రాంతి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండలోనూ, వర్ష సూచనలు ఉన్న వాతావరణంలోనూ ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు పెద్ద సవాలుగా మా రింది. ఇటీవల వాతావరణ మార్పులతో మబ్బులు కమ్మి అక్కడక్కడ వర్షాలు పడుతుండటంతో రైతుల్లో భయం మరింత పెరిగింది. ఏ క్షణమైనా వర్షం పడితే ధాన్యం తడిసి నష్టపోతుందన్న ఆందోళనతో వారు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు.

నెలల తరబడి చేసిన శ్రమ ఒక్క వానతో నాశనం కాకూడదనే భయం వెంటాడుతోంది అని రైతులు వాపోతున్నారు.ప్రభుత్వం ప్రకటించిన మద్ద తు ధర రూ.2329 పొందాలనే ఆశతోనే రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. అయితే కేంద్రాలు ప్రారంభం కాకపోవడం వల్ల మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేక, నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.మండలంలోని అన్ని ధాన్య కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రాల్లో తగిన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, ధాన్యం తూకం, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. అలాగే కొనుగోలు చేసిన వెంటనే రై తులకు బిల్లులు జారీ చేసి, చెల్లింపులు ఆల స్యం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్లో పోసి రోజులు గడుపుతూ కాపులు కాస్తూ ఇబ్బందులు పడుతు న్న ఈ పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే గమనించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

మండల పరిధిలోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే ప్రారంభించాలి. కొనుగోలు కేంద్రంలో రైతులకు మౌలిక వసతులు కల్పించాలి. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్లో పోసి పడి కాపులు కాస్తున్నారని అన్నారు.  

కస్తూరి మధుకర్ రెడ్డి, కోనరావుపేట రైతు