25 May, 2026 | 10:23 PM

భిక్కనూర్ ఎమ్మార్వో కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

25-05-2026 09:31 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంవత్సరాలుగా భూమి సమస్య పరిష్కారం కాకపోవడంతో విసిగిపోయిన ఓ రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అక్కడే ఉన్న తోటి రైతులు అప్రమత్తంగా స్పందించి అతని చేతిలోని అగ్గిపెట్టెను లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రానికి చెందిన బోండ్ల నవీన్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

వంశపారంపర్యంగా వచ్చిన తన పట్టాభూమి ఆన్లైన్ నమోదుకు నాలుగేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సర్వే నెంబర్ 607లో తనకు 1 ఎకరం 25 గుంటల భూమి ఉన్నప్పటికీ, ఆన్లైన్ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నానని తెలిపాడు. భూమి సర్వే కోసం అధికారుల సూచన మేరకు చలానా చెల్లించి తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు.

కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి ఆత్మహత్యే మార్గమని భావించినట్లు రైతు వాపోయాడు. ఘటన అనంతరం ఆర్ఐ బాలయ్య స్పందించి, త్వరలోనే భూ సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతు కొంత శాంతించాడు. కార్యాలయంలో ఎమ్మార్వో పర్యవేక్షణ లోపం, సర్వేయర్ ప్రవీణ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అక్కడున్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.