భవిష్యత్తులో పెళ్లి అర్థమే మారిపోవచ్చు!
‘జాతిరత్నాలు’ చిట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో చిట్టి పాత్రలో ప్రేక్షకుల మనసు అంతలా గెలుచుకుంది ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వైవిధ్యమైన పాత్రలతో తన కెరీర్‌ను నిర్మించుకోవడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నట్లు ఇటీవల ఓ సందర్భంలో ఆమె వెల్లడించింది. కేవలం నటనకే పరిమితం కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలను కూడా నిర్మొహమాటంగా పంచుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ బ్యూటీ.
ఒకవేళ నటి కాకపోయి ఉంటే క్రూయిజ్ షిప్ షెఫ్‌గానో లేదా ఈవెంట్ మేనేజర్‌గానో స్థిరపడేదాన్నని, ట్రావెల్ వ్లాగింగ్‌పైకూడా తనకు ఆసక్తి ఉందని చెబుతోంది ఫరియా. ముఖ్యంగా ప్రేమ, పెళ్లిపై ఫరియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘నా దృష్టిలో ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి. పెళ్లి అనేది ఒక వ్యక్తిని పూర్తిగా మార్చే ప్రక్రియ. ప్రస్తుత తరం పెళ్లిపై ఆసక్తి కోల్పోతోంది. భవిష్యత్తులో ఈ వివాహ వ్యవస్థ అర్థమే మారిపోయే అవకాశం ఉంది. జీవితానికి తోడు అవసరమే.
కానీ, ప్రస్తుత సమాజంలో సంబంధాల పట్ల ధోరణి మారుతోందనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా వివియోగంపైనా అవగాహన కలిగి ఉండాలి. పరిమితికి లోబడి సామాజిక మాధ్యమాలను వాడటం మంచిది. అక్కడ వచ్చే గాసిప్స్ లేదా రూమర్లను పెద్దగా పట్టించుకోకూడదు. నా మట్టుకు నేను కేవలం కెరీర్‌పై దృష్టి సారిస్తున్నా. పాత్ర చిన్నదైనా ప్రభావవంతంగా ఉంటే నటించడానికి నేను సిద్ధం. కొత్త జానర్లను ప్రయత్నిస్తూ ప్రేక్షకులను అలరించాలన్నదే నా కోరిక. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతా’ అని తెలిపింది ఫరియా.






