1 May, 2026 | 1:32 AM

ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

01-05-2026 12:12 AM

కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 30(విజ యక్రాంతి): ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు పని ప్రదేశాల్లో అవసరమైన మౌలి క  సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. గురువారం రెబ్బెన మండలంలోని ఇందిరా నగర్ గ్రామ పంచాయతి పరిధిలోని ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భం గా కూలీలతో మాట్లాడిన కలెక్టర్ త్రాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

గణనకు ప్రజల సహకారం అవసరం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండ్ల గణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమ ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకోవాలని, ఎటువంటి పొరపాట్లు జరిగినా అనంతరం ఎన్యూమరేటర్లు సరిచేస్తారని తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఉపాధి కూలీలకు పనిస్థలాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మకుండా ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాగే నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు నిషేధిత హెచ్డి విత్తనాలను కొనుగోలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని పేర్కొన్నారు.

రబీ సీజన్కు సంబంధించి జిల్లాలో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సన్న రకాలుకు రూ. 500 బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఆర్డీవో లోకేశ్వరరావు, వ్యవసాయ శాఖ అధికారి వెంకటి పాల్గొన్నారు.