ఆనందంతో కళ్లు చెమర్చాయి
రవితేజ నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’ ఆగస్టు 21న విడుదలై, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సోమవారం బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవితేజ మాట్లాడుతూ.. “మా అమ్మాయి మోక్ష కూడా ఈ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తుంటే నా కళ్లు చెమర్చాయి. నాది రాతి గుండె. అలాంటిది ఈ సినిమా చూసి ఏడ్చేశాను. కరోనా టైమ్‌లో ఓటీటీలో తమిళ్, మలయాళ సినిమాలు చూసి, ఇలాంటి సినిమాలు మనకు రావేంటి అనుకున్నాం.
అలాంటి అనుభూతి కలుగజేసిన రూటెడ్ సినిమా ‘ఇరుముడి” అన్నారు. కథానాయకి ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ శివ నిర్వాణ ఒక క్లాసిక్ సినిమా తీశారు. ఈ సినిమా ఒక మెమరబుల్ మూవీగా మిగిలిపోతుంది” అని తెలిపింది. ‘ఈ సినిమాకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ విన్న తర్వాత, చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మాటలకు అందని రియాక్షన్ ఇది’ అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, నటీనటులు సాయికుమార్, స్వసిక, బేబీ నక్షత్ర, డీవోపీ విష్ణు శర్మ, గీత రచయిత అనంత శ్రీరామ్, టీం అందరూ పాల్గొన్నారు.






