రాగన్నగూడ పాత రోడ్డుకు మోక్షమేది?
గుంతలమయంగా మారిన రహదారి..
వర్షం పడితే నీళ్ల కుంటే??
బోనాల వేళ భక్తులకు తప్పని తిప్పలు
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న స్థానికులు
ఆదిబట్ల, ఆగస్టు 10 (విజయక్రాంతి): తొర్రూర్ డివిజన్ పరిధిలోని రాగన్నగూడ పాత విలేజ్ రోడ్డు దుస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోకపోవడంతో రహదారి పొడవునా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారైంది. చిన్నపాటి వర్షం కురిసినా ఆ గుంతల్లో నీరు చేరి రహదారి మొత్తం బురదమయమవుతోంది. దీంతో వాహనదారులు, పాదచారులు ప్రయాణించడానికి నానా అవస్థలు పడుతున్నారు.
బోనాల వేళ భక్తులకు తప్పని అవస్థలు శ్రావణ మాసంలో బోనాల పండుగ సమీపిస్తున్న తరుణంలో, ఆలయాలకు వెళ్లే భక్తులు, బోనాలు ఎత్తుకెళ్లే మహిళలకు ఈ అధ్వానపు రోడ్డు తీరని ఇబ్బందులు సృష్టించేలా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ రోడ్డు దుస్థితి మరింత దారుణంగా మారుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి పలుమార్లు వినతులు అందించినా ఫలితం లేకుండా పోయిందని, గతంలో రోడ్డుపైనే వరి నాట్లు వేసి నిరసన తెలిపినా అధికారుల తీరులో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా స్పందించేనా?
ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాగన్నగూడ పాత విలేజ్ రోడ్డు సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. పండుగకు ముందే మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి స్పందిస్తారా.. లేక సమస్యను యథాతథంగానే వదిలేస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రూ.75లక్షల నిధులు ఏమయ్యాయి?
గతంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హయాంలో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రాగన్నగూడ పాత రోడ్డు అభివృద్ధి కి రూ. 75 లక్షల నిధులు మం జూరయ్యాయి. అయితే ఆ నిధులను ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వేరే ప్రాంతానికి మళ్లించారు. రాగన్నగూడ రోడ్డుకే ఆ నిధులను కేటాయించి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలి. బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలికంగా గుంతలను పూడ్చడంతో పాటు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మించాలి.
మాజీ కౌన్సిలర్ రొక్కం అనిత చంద్రశేఖర్ రెడ్డి
వరి నాట్లతో నిరసన తెలిపినా స్పందన లేదు..
పది రోజుల క్రితం కురిసిన వర్షానికి రహదారిలోని గుంతల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో రోడ్డుపైనే వరి నాట్లు వేసి నిరసన తెలియజేశాం. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్కు నేరుగా వినతిపత్రం అందజేసి సమస్య తీవ్రతను వివరించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోనాల పండుగకు భక్తులు పడే ఇబ్బందులను గమనించి, తక్షణమే గుంతలను పూడ్చి రోడ్డును ప్రయాణానికి అనువుగా మార్చాలి.
ఎలిమినేటి నరసింహారెడ్డి, బీజేపీ నాయకుడు






