ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో అద్భుత ఫలితాలు
మండల టాపర్గా బి. కీర్తన 570 మార్కులు
మొయినాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మొయినాబాద్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఈసారి పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించారు. మొత్తం మీద ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగి మంచి ప్రగతి కనిపించింది. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యార్థులు 80 శాతం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మొత్తం 786 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 687 మంది ఉత్తీర్ణులై సుమారు 87 శాతం ఫలితాలు నమోదయ్యాయి. కనకమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బి. కీర్తన 570 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. పెద్దమంగళారం పాఠశాలకు చెందిన వైష్ణవి 538 మార్కులు, నజీబ్నగర్ కేజీబీవీకి చెందిన వి. చందన 528 మార్కులు సాధించారు. గురుకుల పాఠశాలల్లో 100% ఫలితాలు: మొయినాబాద్ పరిధిలోని పలు గురుకుల పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.
తోల్కట్టాలోని చేవెళ్ల గురుకుల బాలికల పాఠశాలలో 77 మంది విద్యార్థులు 77 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బి. లిఖిత 555, జి. చరిత 552, కే. మణిదీప్తి 550, ఏ. మేఘన 548, ఎన్. అపర్ణ 547 మార్కులు సాధించారు. షాబాద్ బీసీ గురుకుల బాలికల పాఠశాలలో కూడా 100 శాతం ఫలితాలు నమోదయ్యాయి. కనకమామిడిలోని మియ్యాపూర్ బీసీ గురుకుల పాఠశాలలో 51 మంది విద్యార్థులు 51 మంది ఉత్తీర్ణులయ్యారు. మొయినాబాద్ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో 75 మందిలో 71 మంది ఉత్తీర్ణులై 94 శాతం ఫలితాలు నమోదు కాగా, నిషాత్ 557 మార్కులు సాధించింది. చిలుకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల శ్రమకు నిదర్శనమని విద్యా వర్గాలు అభిప్రాయపడ్డాయి.






