పోలీసుల అదుపులో గుప్తనిధుల తవ్వకాల నిందితులు
అయిదుగురు నిందితులు, జేసీబీ స్వాధీనం
ప్రజలు మూడనమ్మాకాలతో మోసపోవద్దు
అమ్రాబాద్ సీఐ అంజయ్య.
అచ్చంపేట: నల్లమలలో గుప్తనిధుల తవ్వకాల కోసం ప్రయత్నించిన ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకొని, జేసీబీ వాహనం స్వాధీనం చేసుకున్నామని అమ్రాబాద్ సీఐ అంజయ్య, ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. నిందితులను శుక్రవారం సాయంత్రం మీడియా ఎదుట ప్రవేశపెట్టి ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సీఐ వివరాల ప్రకారం.. పదర మండలం ఉడిమిళ్ల గ్రామ శివారులోని వినాయకుడి మాన్యం ప్రాంతంలో ఈ నెల 24 కొంత మంది వ్యక్తులు గుప్తనిధుల తవ్వకాల ప్రయత్నం చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప్పునుంతల గ్రామానికి చెందిన మదనాగుల మల్లయ్య మరికొంత మంది కలిసి నల్లమల ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ క్రమంలో అచ్చంపేటకు చెందిన జేసీబీ డ్రైవర్ పుట్ట మల్లేష్‌ను సంప్రదించాడు.
అతను ఐనోల్ గ్రామానికి చెందిన వడ్త్య ధర్మకు చెందిన జేసీబీ వాహనాన్ని ఏర్పాటు చేశాడు. దాని అద్దె కోసం రూ.15 వేలను ఫోన్ పే ద్వారా అడ్వాన్స్‌గా చెల్లించారు. అలాగే ఉడిమిల్ల గ్రామానికి చెందిన మేఘావత్ మోతీలాల్, కాస నాగరాజులను సంప్రదించి వినాయకుడి మాన్యం ప్రాంతంలో గుప్తనిధులు తవ్వకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 24న రెండు కార్లలలో మాన్యం ప్రాంతానికి చేరుకొని.. కొన్ని ప్రత్యేక పూజలు నిర్విహించారు. అనంతరం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. మోతిలాల్, నాగరాజులను తవ్వకం చేసే ప్రాంతంలో కాపలగా ఉంచి.. మిగతా ముగ్గురు కలిసి తవ్వకాలు చేశారు. సుమారు అరగంట ప్రయత్నించిన ఎలాంటి నిధి లభించలేదు.
దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ శుక్రవారం తవ్వకాలు చేయాలని నిర్ణయించుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో నిందితులు కారులో వెళ్తుండగా మన్ననూర్ చెక్ పోస్టు వద్ద అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో భాగస్వామ్యమైన మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించామని సీఐ తెలిపారు. ప్రజలెవరూ మూడనమ్మకాలతో మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. అటవీ, దేవాదాయ భూములకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసులను సీఐ అభినందించారు.






