24-02-2026 12:23:34 AM
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన నటనతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. అమెరికాలోనే స్థిరపడి హాలీవుడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ గ్లోబల్ బ్యూటీ ఇప్పుడు తెలుగులో పరిచయం కాబోతుంది. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. బాలీవుడ్‌ను వదిలేయడం వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టింది. “నేను బాలీవుడ్‌ను కావాలని వదిలేయలేదు. అక్కడ వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే నా మార్కెట్‌ను విస్తరించుకోవాలని ఆశపడ్డా. కానీ, ఒకానొక దశలో నా కెరీర్ ఒకేచోట ఆగిపోయినట్లు అనిపించింది.
నాకు రావాల్సిన అవకాశాలు తగ్గిపోవడం, కావాలని నన్ను పక్కన పెట్టడం నన్ను తొక్కేయాలని చూడటం వంటి కారణాల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యా. ఆ క్లిష్ట పరిస్థితుల్లోనే నన్ను నేను నిరూపించుకోవడానికి హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నా. అక్కడ సుస్థిర స్థానం సంపాదించుకున్నా. నేను ఎప్పటికీ ఇండియన్ సినిమాల్లో నటించడానికే ఇష్టపడతా” అని తెలిపింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.