అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ వెలుగులు
ఉచిత విద్యుత్ కనెక్షన్లతో ఎన్పీడీసీఎల్ సేవలు
చిన్నారుల భవిష్యత్తుకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యం: ఎస్ఈ వెల్లడి
మహబూబాబాద్ (విజయక్రాంతి): చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కే. దర్శన్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని మొత్తం 927 అంగన్వాడి కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు, ప్రీ-స్కూల్ కార్యకలాపాలు, ఆటలు, అభ్యసన కార్యక్రమాలు, పోషకాహార పంపిణీ, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఎంతో దోహదపడుతుందని ఎస్ఈ తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి రావడంతో అంగన్వాడి కేంద్రాల్లో ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.
దీంతో చిన్నారులు వేడి, ఉక్కపోత వంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యా, అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారని తెలిపారు. అలాగే అంగన్వాడి కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పారు. చిన్నారులకు పోషకాహారం తయారీ, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత, ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమం, విద్య, ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత అనుగుణంగా సర్కిల్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తోందని ఎస్ఈ తెలిపారు. ప్రతి అంగన్వాడి కేంద్రం విద్యుత్ వెలుగులతో కళకళలాడేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.






