రోడ్ల మరమ్మతులు, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులతో ఎమ్మెల్యే మురళి నాయక్ సమీక్ష
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోడ్ల మరమ్మతులు, పెండింగ్‌లో ఉన్న పనులు, నూతన రహదారుల నిర్మాణం తదితర అంశాలపై మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ ఈఈ, ఆర్‌అండ్‌బీ ఈఈతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని రహదారుల పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు.
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం మెరుగుపరచడంపై ఎమ్మెల్యే ప్రత్యేకంగా దృష్టి సారించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రహదారి నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న మారుమూల గ్రామాలకు కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్స్ (ప్రతిపాదనలు) సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అవసరమైన చోట్ల హై లెవల్ బ్రిడ్జిలు, కల్వర్టులు, ఇతర మౌలిక వసతుల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు తెలిపారు.
వర్షాకాలంలో రోడ్లు దెబ్బతినకుండా, ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. “నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యం. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా అవసరమైన ప్రతి ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి నిధులు తీసుకువస్తాం” అని ఎమ్మెల్యే మురళి నాయక్ తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






